Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 దిన 12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


దావీదు దగ్గర చేరిన వీరులు

1 కీషు కుమారుడైన సౌలు దగ్గర నుండి బహిష్కరించబడి దావీదు సిక్లగులో ఉన్నప్పుడు అతని దగ్గరకు వచ్చినవారు వీరు (అతనికి యుద్ధంలో సహాయపడిన వీరులలో ఉన్నవారు;

2 వీరు బాణాలు ధరించి కుడిచేతితో ఎడమచేతితో బాణాలు వేయడంలో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో సమర్థులు; వీరు బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలు బంధువులు):

3 నాయకుడైన అహీయెజెరు, యోవాషు; వీరు గిబియోనీయుడైన షెమాయా కుమారులు; అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు; బెరాకా, అనాతోతీయుడైన యెహు,

4 ముప్పైమందిలో పరాక్రమశాలి, ముప్పైమందికి నాయకుడు, గిబియోనీయుడైన ఇష్మయా; యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,

5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫట్యా;

6 కోరహీయులైన ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యషోబీము;

7 గెదోరు వాడైన యెరోహాము కుమారులైన యోహేలా, జెబద్యా.

8 కొంతమంది గాదీయులు తమ కూటమిని మార్చుకొని అరణ్యంలో సురక్షితమైన స్థలంలో ఉన్న దావీదు దగ్గర చేరారు. వారు పరాక్రమశాలులు, యుద్ధానికి సిద్ధపడినవారు, డాలు ఈటెలను వాడే సమర్థులు, వారు సింహం ముఖంలాంటి ముఖాలు కలిగి కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్తగలరు.

9 వారెవరంటే, నాయకుడైన ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,

10 నాలుగవవాడు మిష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,

11 ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలీయేలు,

12 ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవ వాడు ఎల్జాబాదు,

13 పదవ వాడు యిర్మీయా, పదకొండవ వాడు మక్బన్నయి.

14 ఈ గాదీయులు సైన్యాధిపతులు; వీరిలో చివరివాడు వందమందికి, అత్యధికుడు వెయ్యిమందికి అధిపతులుగా ఉన్నారు.

15 యొర్దాను నది గట్లమీదుగా పొర్లి పారుతున్నప్పుడు, మొదటి నెలలో దానిని దాటి వెళ్లి లోయల్లో తూర్పు నుండి పడమర వరకు ఉన్నవారినందరిని తరిమివేసింది వీరే.

16 ఇతర బెన్యామీనీయులు, కొంతమంది యూదా వారు కూడా దావీదు ఉన్న సురక్షిత స్థలానికి వచ్చారు.

17 దావీదు వారిని కలుసుకోడానికి బయలుదేరి వెళ్లి వారితో, “మీరు సమాధానంతో నాకు సహాయం చేయడానికి నా దగ్గరకు వస్తే, మిమ్మల్ని నాతో చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా వలన మీకు ప్రమాదమేమి లేదని తెలుసుకుని మీరు నన్ను శత్రువులకు అప్పగించడానికి వచ్చి ఉంటే, మన పూర్వికుల దేవుడు దానిని చూసి మీకు తీర్పు తీర్చును గాక” అన్నాడు.

18 అప్పుడు ముప్పైమందికి నాయకుడైన అమాశై మీదికి ఆత్మ రాగా అతడు అన్నాడు: “దావీదూ, మేము నీ వారము! యెష్షయి కుమారుడా! మేము నీతో ఉన్నాము. నీకు సమాధానం, సమాధానం, నీ సహాయకులకు సమాధానం కలుగును, నీ దేవుడే నీకు సహాయం చేస్తారు.” కాబట్టి దావీదు వారిని చేర్చుకొని తన బలగాలకు నాయకులుగా నియమించాడు.

19 సౌలు మీద యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులతో పాటు దావీదు బయలుదేరినప్పుడు, మనష్షే గోత్రంలోని కొంతమంది అతని పక్షం చేరారు. (దావీదు అతని మనుష్యులు ఫిలిష్తీయులకు సహాయం చేయలేదు, ఎందుకంటే ఫిలిష్తీయుల నాయకులు, “అతడు మళ్ళీ తన యజమానియైన సౌలు పక్షం చేరితే మనకు ప్రాణాపాయం కలుగుతుంది” అని భావించి దావీదును పంపివేశారు.)

20 దావీదు సిక్లగుకు వెళ్లినప్పుడు దావీదు దగ్గర చేరిన మనష్షే గోత్రికులు వీరు: వేయిమంది సైన్యానికి అధిపతులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై.

21 వారందరు పరాక్రమశాలులు కాబట్టి దావీదు సైన్యంలో అధిపతులుగా ఉండి దోపిడి మూకలను ఎదుర్కోడానికి దావీదుకు సహాయం చేశారు.

22 ప్రతిరోజు దావీదుకు సహాయం చేయడానికి మనుష్యులు వస్తుండడంతో, అతని సైన్యం దేవుని సైన్యంవలె మహా సైన్యంగా మారింది.


హెబ్రోనులో దావీదు దగ్గర చేరిన ఇతరులు

23 యెహోవా చెప్పినట్లు, సౌలు రాజ్యాన్ని దావీదు వశం చేయడానికి హెబ్రోనులో అతని దగ్గరకు ఆయుధాలు ధరించి వచ్చిన యుద్ధవీరుల లెక్కలు ఇవే:

24 యూదా వారిలో డాలు, ఈటె పట్టుకుని యుద్ధానికి సిద్ధపడినవారు 6,800 మంది;

25 షిమ్యోనీయులలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వీరులు 7,100 మంది;

26 లేవీయులలో 4,600 మంది,

27 అహరోను కుటుంబానికి నాయకుడైన యెహోయాదా, అతనితో ఉన్న 3,700 మంది,

28 పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని కుటుంబానికి చెందిన అధిపతులు 22 మంది;

29 సౌలు గోత్రమైన బెన్యామీనీయులలో 3,000 మంది, అప్పటివరకు వారిలో చాలామంది సౌలు ఇంటికి నమ్మకంగా ఉన్నవారు;

30 ఎఫ్రాయిం నుండి తమ వంశాలలో పేరు పొందిన పరాక్రమశాలులైన 20,800 మంది;

31 మనష్షే అర్థగోత్రం నుండి, దావీదును రాజుగా చేయడానికి రావాలని పేరుపేరున నియమించబడినవారు 18,000 మంది;

32 ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం కలిగి, ఇశ్రాయేలీయులు ఏం చేయాలో తెలిసిన 200 మంది అధిపతులు, వారి ఆజ్ఞకు లోబడి ఉండే వారి బంధువులందరు;

33 జెబూలూనీయులలో అన్ని రకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్లగలిగిన యుద్ధ నైపుణ్యం కలవారు, దావీదుకు నమ్మకంగా ఉండి యుద్ధం చేయగలవారు 50,000 మంది;

34 నఫ్తాలీయులలో 1,000 అధికారులు, వారితో పాటు డాలు, ఈటె పట్టుకున్నవారు 37,000 మంది;

35 దానీయులలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 28,600 మంది;

36 ఆషేరీయులలో నైపుణ్యం కలిగి యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 40,000 మంది;

37 ఇంకా యొర్దాను నది తూర్పున ఉండే రూబేనీయులలో, గాదీయులలో, మనష్షే అర్ధగోత్రపు వారిలో అన్ని రకాల ఆయుధాలను ధరించగలిగిన వారు 1,20,000 మంది.

38 ఈ వీరులందరు సైన్యంలో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరంతా హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలని సంపూర్ణంగా తీర్మానించుకొని ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు. ఇశ్రాయేలులో మిగిలిన వారందరూ దావీదును రాజుగా చేయాలని ఏకమనస్సుతో కోరుకున్నారు.

39 వారి కుటుంబాలు వారి కోసం భోజనపదార్థాలు సిద్ధం చేశారు, కాబట్టి వారు అక్కడే తిని త్రాగి దావీదుతో పాటు మూడు రోజులు ఉన్నారు.

40 ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి సరిహద్దు ప్రాంతాల నుండి వారి పొరుగువారు గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు, ఎడ్ల మీద ఆహారపదార్థాలు తీసుకువచ్చారు. వాటిలో పిండి వంటకాలు, అంజూర పండ్ల ముద్దలు, ద్రాక్షపండ్ల ముద్దలు, ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువులు, గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan