Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

జెకర్యా 10 - పవిత్ర బైబిల్


యెహోవా వాగ్దానాలు

1 వసంత ఋతువులో వర్షం కొరకు యెహోవాను ప్రార్థించండి. యెహోవా మెరుపులను కలుగజేస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రతివాని పొలంలోనూ దేవుడు పైరులు పెరిగేలా చేస్తాడు.

2 భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రజలు తమ చిన్న విగ్రహాలను, మంత్రతంత్రాలను ఉపయోగిస్తారు. కాని అది నిరుపయోగం. ఆ జనులు దర్శనాలు చూసి, తమ కలలను వివరిస్తారు. కాని అవన్నీ పనికిరాని అబద్ధాలు. అందువల్ల ప్రజలు సహాయంకొరకు గొర్రెల్లా అరుస్తూ ఇక్కడా, అక్కడా తిరుగుతారు. కాని వారిని నడిపించటానికి కాపరిలేడు.

3 యెహోవా చెపుతున్నాడు: “కాపరుల (నాయకుల) పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నా గొర్రెలకు (ప్రజలకు) జరిగిన దానికి నేను ఆ నాయకులను బాధ్యులనుగా చేశాను.” (యూదా ప్రజలు దేవుని యొక్క గొర్రెల మంద. సర్వశక్తిమంతుడైన యెహోవా తన మంద విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఒక సైనికుడు తన అందమైన యుద్ధగుర్రం విషయంలో శ్రద్ధ చూపినట్టు, ఆయన వారి పట్ల జాగ్రత్త తీసుకుంటాడు.)

4 “పునాదిరాయి, గుడారపు గుంజ, యుద్ధ విల్లు, ముందుకు చొచ్చుకువచ్చే సైన్యం అన్నీ యూదానుండి కలిసి వస్తాయి.

5 వారు తమ శత్రువును ఓడిస్తారు. అది సైనికులు బురద వీధులగుండా నడిచినట్లు ఉంటుంది. వారు పోరాడతారు. యెహోవా వారితోవున్న కారణంగా వారు శత్రువుకు చెందిన గుర్రపు దళాలను కూడ ఓడిస్తారు.

6 యూదా వంశాన్ని నేను బలపర్చుతాను. యోసేపు వంశాన్ని యుద్ధంలో గెలిచేలా చేస్తాను. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి తీసుకు వస్తాను. వారిని ఓదార్చుతాను. అది నేను వారిని ఎప్పుడూ విడిచి పెట్టనట్లుగా ఉంటుంది. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి సహాయం చేస్తాను.

7 ఎఫ్రాయిము ప్రజలు తాగటానికి పుష్కలంగా దొరికిన సైనికులవలె సంతోషంగా ఉంటారు. వారి పిల్లలు ఉల్లాసంగా ఉంటారు. వారు కూడ హాయిగా ఉంటారు. వారంతా యెహోవాతో కలిసి ఉండే ఆనందమయ సమయాన్ని కలిగి ఉంటారు.

8 “నేను వారికొరకు ఈల వేసి, వారందరినీ ఒక్కచోటికి పిలుస్తాను. నేను వారిని నిజంగా రక్షిస్తాను. వారి సంఖ్య విస్తారంగా ఉంటుంది.

9 అవును, నా ప్రజలను అనేక దేశాలకు చెదరగొడుతూ వచ్చాను. కాని ఆ దూర దేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. వారు, వారి పిల్లలు బతుకుతారు. పైగా వారు తిరిగి వస్తారు.

10 నేను వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుంచి, అష్షూరు నుంచి వెనుకకు తీసుకు వస్తాను. వారిని గిలాదు ప్రాంతానికి తిరిగి తీసుకువస్తాను. అక్కడ వారికి సరిపోయే స్థలం వుండదు గనుక, వారిని దగ్గరలోనేవున్న లెబానోనులో నివసించనిస్తాను.”

11 దేవుడు వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయటకు తీసికొని వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి ఉంటుంది. ఆయన సముద్రపు అలలను కొట్టగా, సముద్రం రెండు పాయలు అయ్యింది. ప్రజలు ఆ కష్టాల సముద్రం మధ్యనుండి నడిచి వచ్చారు. యెహోవా నదీ ప్రవాహాలను ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరు గర్వాన్ని, ఈజిప్టు (ఐగుప్తు) అధికారాన్ని ఆయన నాశనం చేస్తాడు.

12 యెహోవా తన ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan