పరమగీతము 5 - పవిత్ర బైబిల్అతను అంటాడు 1 నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను, నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను, తేనె త్రాగాను. తేనె పట్టును తిన్నాను నేను నా ద్రాక్షాక్షీరాలు సేవించాను. ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, త్రాగండి! ప్రేమను త్రాగి మత్తిల్లండి! ప్రేమికులతో స్త్రీలు అంటారు ఆమె అంటుంది 2 నేను నిద్రించానేగాని నా హృదయం మేల్కొనేవుంది. నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను “నా ప్రియ సఖీ, ప్రేయసీ, నా పావురమా, పరిపూర్ణవతీ! తలుపు తెఱువు. నా తల మంచుతో తడిసింది నా జుట్టు రేమంచు జడికి నానింది.” 3 “నేను నా పైవస్త్రం తొలగించాను, దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు. నేను నా పాదాలు కడుక్కున్నాను. అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.” 4 తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు నేనతని పట్ల జాలినొందాను. 5 నా చేతుల నుంచి జటామాంసి జారగా, నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవ్యం తలుపు గడియ పైకి జాలువారగా నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను. 6 నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను, కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు! అతడు వెళ్లిపోయినంతనే నా ప్రాణం కడగట్టింది. నేనతని కోసం గాలించాను. కాని అతడు కనిపించలేదు. నేనతన్ని పిలిచాను, కాని అతడు బదులీయలేదు. 7 నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు నన్ను కొట్టి, గాయపరిచారు. ప్రాకారం కావలివారు నా పైవస్త్రాన్ని కాజేశారు. 8 యెరూషలేము స్త్రీలారా, నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని. ఆమెకు యెరూషలేము స్త్రీల ప్రశ్నలు 9 అతిసుందరవతీ, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి? ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు దేనిలో ఎక్కువ? అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు? యెరూషలేము స్త్రీలకు ఆమె సమాధానం 10 నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు. పదివేలలోనైన గుర్తింపుగలవాడు. 11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు. 12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరే పావురాలకళ్లలాంటివి. పాల మునిగిన పావురాలవలెను, బంగారంలో పొదిగిన రత్నాల వలెను, 13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల పరిమళ పుష్పరాశులవలెను, అతని పెదవులు అత్తరువారి బోళంతో తడిసిన కెందామరలు (ఎర్ర తామరలు). 14 అతని చేతులు వజ్రాలు పొదిగిన బంగారు కడ్డీల సమానం అతని శరీరం నీలాలు తాపిన నున్నటి దంత దూలము వలెను, 15 అతని పాదాలు బంగారు దిమ్మమీది పాలరాతి స్తంభాల వలెను, అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయును. 16 ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు, అతని అధరం పెదవి అత్యంత మధురం అతనే నా ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International