Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

పరమగీతము 1 - పవిత్ర బైబిల్

1 సొలొమోను గీతాలలో ఉన్నత గీతం


వరునితో వధువు

2 తన నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొననిమ్ము ఎందుకంటే ద్రాక్షా రసంకన్నా మధురమయింది నీ ప్రేమ.

3 నీ పరిమళ ద్రవ్యం అద్భుతమైన సువాసననిస్తుంది, కాని మిక్కిలి ఉత్తమ పరిమళ ద్రవ్యం కన్నా నీ పేరు తియ్యనైనది. అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తారు.

4 నన్ను ఆకర్షించుకొనుము! మేము నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాము! రాజు తన రాజ గృహానికి నన్ను తీసుకు వెళ్ళాడు. మేము ఆనందిస్తాం. నీకోసం సంతోషంగా ఉంటాం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుందని జ్ఞాపకముంచుకొనుము. మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.


యెరూషలేము స్త్రీలు వరునితో వధువు స్త్రీలతో అంటుంది

5 యెరూషలేము పుత్రికలారా, కేదారు, సల్మా గుడారముల నలుపువలె నేను నల్లగా అందంగా ఉన్నాను.

6 నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు, సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు. నా సోదరులు నా మీద కోపగించారు. వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు. అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను.


ఆమె అతనితో అంటుంది

7 నా ప్రాణం అంతటితో నిన్ను ప్రేమిస్తాను! నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో, మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు. నీతో ఉండటానికి నేను రావాలి లేకపోతే నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీని అవుతాను!


అతను ఆమెతో అంటున్నాడు

8 నీవు అంత అందమైనదానవు! కనుక నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో. వెళ్లు, గొర్రెలను వెంబడించు. నీ చిన్న మేకల్ని కాపరుల గుడారాల వద్ద మేపు.

9 నా ప్రియురాలా, ఫరో రథాలు లాగుతున్న నా ఆడ గుర్రాలతో నిన్నుపోల్చియున్నాను.

10-11 నీకోసం చేసిన అలంకరణలివిగో, బంగారు తలకట్టు, వెండి గొలుసు. నీ చెక్కిళ్లు ఎంతో అందంగా ఉన్నాయి బంగారు అలంకరణలతో, నీ మెడ ఎంతో అందంగా ఉంది వెండి అల్లికలతో.


ఆమె అంటుంది

12 నా పరిమళ ద్రవ్యపు సువాసన తన మంచంమీద పడుకున్న రాజును చేరింది.

13 నా స్తనాల మధ్య పడివున్న నా మెడలో వున్న చిన్న గోపరసం సంచిలాంటి వాడు నా ప్రియుడు.

14 ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు పూల గుత్తిలాంటివాడు నా ప్రియుడు.


అతడు అంటున్నాడు

15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు! నీ కళ్లు పావురపు కళ్లలా వున్నాయి.


ఆమె అంటుంది

16 నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు! అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు! మన శయ్య ఆకుపచ్చగా ఆహ్లాదంగా ఉంది

17 మన యింటి దూలాలు దేవదారువి అడ్డకర్రలు సరళమ్రానువి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan