Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

రూతు 1 - పవిత్ర బైబిల్


యూదాలో

1 పూర్వం న్యాయాధిపతులు ఏలిన కాలంలో, తినటానికి చాలినంత ఆహారం దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలోని బేత్లెహేము వదలిపెట్టి, అతను, అతని భార్య, అతని యిద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బ్రతకడానికి వెళ్లారు.

2 అతని భార్య పేరు నయోమి, అతని యిద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వాళ్లు యూదాలోని బేత్లెహేములో ఎఫ్రాతా వంశానికి చెందినవాళ్లు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడే ఉండిపోయారు.

3 ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు కుమారులు మాత్రమే మిగిలారు.

4 మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నిపసించారు.

5 అంతలో మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది


నయోమి ఇంటికి వెళ్లిపోతుంది

6 దేవుడు తన ప్రజలకు సహాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయచేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు.

7 అంతవరకు బ్రతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు పెట్టారు.

8 అప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్లండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన, నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను.

9 మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడ్వటం మోదలు పెట్టారు.

10 ఆ కోడళ్లు, “మేమూ నీతోనే వచ్చేస్తాము. నీ కుటుంబంలోనే ఉంటాము” అన్నారు.

11 కాని నయోమి ఇలా అన్నది: “నా కుమార్తెలారా! మీ పుట్టిళ్లకు వెళ్లిపొండి. మీరు నాతో రావడం దేనికి? మిమ్మల్ని పెళ్లిచేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరూ కుమారులు లేరు.

12 ఇంటికి వెళ్లిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను, ఒకవేళ నాకు మళ్లీ పెళ్లవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రే గర్భవతినై నాకు ఇద్దరు కుమారులు పుట్టినా

13 మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్లు పెద్ద వాళ్లయ్యేంతవరకు మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది.”

14 అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది.

15 నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.”

16 కానీ రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్తాను. నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే నావారు, నీ దేవుడే నా దేవుడు.

17 నీవు ఎక్కడ చస్తే నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేది మనలను విడదీయ లేదు.”


స్వంత ఇంటికి రావటం

18 రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది.

19 నయోమి, రూతు కలసి బేత్లెహేము పురము వరకు ప్రయాణము చేశారు. వారిద్దరూ బేత్లెహేము చేరగానే ఆ ఊరివారంతా సంబరపడిపోయి. “ఈమె నయోమి కదూ?” అని చెప్పుకున్నారు.

20 “నన్ను (మధురము) నయోమి అని పిలవకండి. నన్ను మారా అని పిలవండి. ఎందుచేతనంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు నా బ్రతుకును చాలా దుఃఖమయం చేశాడు.

21 నేను వెళ్లినప్పుడు నాకు కావాల్సింది అంతా ఉండేది. కాని, దేవుడు ఇప్పుడు నన్నుఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన నన్ను దుఃఖమయినిగా చేస్తే, మీరు నన్ను సంతోషం అని పిలవడం దేనికి? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చాలా బాధపెట్టాడు” అని నయోమి వారితో అన్నది.

22 అలా నయోమి, ఆమె కోడలు రూతు (మోయాబు స్త్రీ) మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేశారు. యవల పంటకోత మొదలవుతున్న రోజుల్లో వీరిద్దరూ యూదాలోని బేత్లెహేము పురము చేరుకున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan