కీర్తన 9 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన. 1 పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను. 2 నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు. మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను. 3 నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు. కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు. 4 నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు. యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు. 5 యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు. యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు. బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు. 6 శత్రువు పని అంతం అయిపోయింది. యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు. ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు. 7 అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు. 8 భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు. 9 అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు. ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు. యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము. 10 నీ నామం తెలిసిన ప్రజలు నీమీద విశ్వాసం ఉంచాలి. యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు. 11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి. 12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు. మరి యెహోవా వారిని మరచిపోలేదు. 13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము. నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము. ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము. 14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను. నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.” 15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు. కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు. ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు. కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి. 16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు. యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్ 17 దేవుని మరచే ప్రజలు దుష్టులు. ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు. 18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది. కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు. 19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము. వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము. 20 ప్రజలకు పాఠం నేర్పించు. వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International