Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 86 - పవిత్ర బైబిల్


దావీదు ప్రార్థన.

1 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి. యెహోవా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.

2 యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు. నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు. నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.

3 నా ప్రభువా, నా మీద దయ చూపించుము. రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.

4 ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.

5 ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.

6 యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే నా ప్రార్థనలు ఆలకించుము.

7 యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.

8 దేవా, నీవంటివారు మరొకరు లేరు. నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.

9 ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు. వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.

10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు. నీవు మాత్రమే దేవుడవు.

11 యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను. నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా అతి ముఖ్యాంశంగా చేయుము.

12 దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.

13 దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.

14 దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు. కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.

15 ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు. నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.

16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము. నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను. నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.

17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము. అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు. ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan