కీర్తన 81 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన. 1 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి. ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి. 2 సంగీతం ప్రారంభించండి. గిలక తప్పెట వాయించండి. స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి. 3 నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. పౌర్ణమినాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం. 4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం. ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు. 5 ఈజిప్టునుండి యోసేపును దేవుడు తీసుకొనిపోయిన సమయంలో దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు. ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను. 6 దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను. నేను మీ మోతగంప పడవేయనిచ్చాను. 7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను. తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను. నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.” 8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక నేను మీకు యిస్తాను. ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి! 9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను ఎవరినీ ఆరాధించవద్దు. 10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే. ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు, నేను దానిని నింపుతాను. 11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు. ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు. 12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను. ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు. 13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే, 14 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను. ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను. 15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు, అందుచేత వారు శిక్షించబడతారు. 16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు. తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.” |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International