Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 73 - పవిత్ర బైబిల్


మూడవ భాగం (కీర్తనలు 73–89)
ఆసాపు స్తుతి కీర్తన.

1 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు. పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.

2 నేను దాదాపుగా జారిపోయి, పాపం చేయటం మొదలు పెట్టాను.

3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను. ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.

4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు. వారు జీవించుటకు శ్రమపడరు.

5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు. ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.

6 కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు. వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.

7 ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు. వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.

8 ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు. వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.

9 ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు. వారు భూమిని పాలించేవారని తలుస్తారు.

10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి వారు చెప్పే సంగతులు నమ్ముతారు.

11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు. సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”

12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు. మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.

13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి? నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?

14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను. నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.

15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను. కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.

16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను. కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.

17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను, వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.

18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు. వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.

19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును. అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు. భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు. అప్పుడు వారు అంతమైపోతారు.

20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు. మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను నీవు కనబడకుండా చేస్తావు.

21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను. ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను. దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను. తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.

23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.

24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము. ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.

25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు. మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?

26 ఒకవేళ నా మనస్సు, నా శరీరం నాశనం చేయబడతాయేమో. కాని నేను ప్రేమించే బండ నాకు ఉంది. నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.

27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు. నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.

28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను. దేవుడు నా యెడల దయ చూపించాడు. నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం. దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan