కీర్తన 51 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన. 1 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా నా మీద దయ చూపించుము. నీ మహా దయ మూలంగా నా పాపాలన్నీ తుడిచివేయుము. 2 దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము. 3 నేను పాపం చేశానని నాకు తెలుసు. నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను. 4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే. 5 నేను పాపంలో పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. 6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు. అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము. 7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము. నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము. 8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము. నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము. 9 నా పాపాలను చూడకుము! వాటన్నింటినీ తుడిచి వేయుము. 10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము నా ఆత్మను నూతనపరచి బలపరచుము. 11 నన్ను త్రోసివేయకుము! నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము. 12 నీచేత రక్షించబడుట మూలంగా కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము! నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము. 13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను. వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు. 14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము. నా దేవా, నీవే నా రక్షకుడవు. నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము. 15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము. 16 నీవు బలులు కోరటం లేదు. లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు. 17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు. 18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము. యెరూషలేము గోడలను కట్టుము. 19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు. మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International