కీర్తన 49 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన. 1 సర్వ దేశములారా, ఇది వినండి. భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి. 2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి. 3 నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను. నా ఆలోచనలు బుద్ధినిస్తాయి. 4 సామెతపైనా ఆసక్తినుంచుతాను. ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను. 5 అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు. నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు. 6 ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు. 7 ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు. నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు. 8 ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు. 9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు, మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు. 10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు. మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు. 11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది. వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు. 12 ధనికులు నిరంతరం జీవించలేరు. వారు జంతువుల్లా మరణిస్తారు. 13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది. 14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి. మరణం వారి కాపరి. వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి. 15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు. సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు. 16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు. వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు. 17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు. వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు. 18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు. ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా, 19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు. అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు. 20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International