Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 42 - పవిత్ర బైబిల్


రెండవ భాగం (కీర్తనలు 42–72)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం

1 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.

2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది. ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?

3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం. నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.

4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము. నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం, ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం. అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.

5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను? ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది. ఆయన నన్ను కాపాడుతాడు.

6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను. కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.

7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది. నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.

8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు. అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.

9 ఆశ్రయ బండ అయిన నా దేవునితో, “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.

10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు. “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.

11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా సహాయమా! నా దేవా!

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan