Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 40 - పవిత్ర బైబిల్


సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

1 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను. నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.

2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు. ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు. ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు. ఆయన నా పాదాలను స్థిరపరచాడు.

3 ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను యెహోవా నా నోట ఉంచాడు. నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు. వారు యెహోవాను నమ్ముకొంటారు.

4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.

5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు. మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు. నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను. నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు. బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు. దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.

7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను. నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.

8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను. నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”

9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను. యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.

10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను. ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను. యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను. నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.

11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు. నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు. లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు. నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి. నేను వాటిని తప్పించుకోలేను. నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి. నేను ధైర్యాన్ని కోల్పోయాను.

13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము. త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.

14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.

15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు. వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.

16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము. “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని. యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము. నాకు సహాయం చేయుము. నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan