Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 38 - పవిత్ర బైబిల్


జ్ఞాపకార్థ దినం కోసం దావీదు కీర్తన.

1 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు. నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.

2 యెహోవా, నీవు నన్ను బాధించావు. నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.

3 నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.

4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.

5 నేను తెలివితక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.

6 నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.

7 నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది.

8 నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.

9 ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.

10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది. నా చూపు దాదాపు పోయింది.

11 నా రోగం మూలంగా నా స్నేహితులు, నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. నా కుటుంబం నా దగ్గరకు రాదు.

12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు. వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.

13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను. మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.

14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.

15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.

16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.

17 నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను.

18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను. నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.

19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.

20 నా శత్రువులు నాకు కీడు చేశారు, నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను. మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.

21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.

22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా, నన్ను రక్షించుము.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan