Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 34 - పవిత్ర బైబిల్


దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

1 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.

2 దీన జనులారా, విని సంతోషించండి. నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.

3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి. మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.

4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు. నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.

5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి. మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.

6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా నా మొర విన్నాడు. నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.

7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు. ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.

8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి. యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.

9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి. ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.

10 యౌవనసింహాలు బలహీనమై, ఆకలిగొంటాయి. అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.

11 పిల్లలారా, నా మాట వినండి. యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.

12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే, ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే

13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,

14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి. శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.

15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. ఆయన వారి ప్రార్థనలు వింటాడు.

16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు. ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు. ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.

18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు. ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.

19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు. కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.

20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు. ఒక్క ఎముక కూడా విరువబడదు.

21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి. చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.

22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు. తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan