కీర్తన 33 - పవిత్ర బైబిల్1 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి. నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి. 2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి. యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి. 3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి. ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి. 4 దేవుని మాట సత్యం! ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును. 5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు. 6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది. భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది. 7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు. మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు. 8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి. ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి. 9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది. ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది. 10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు. వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు. 11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది. ఆయన తలంపులు తర తరాలకు మంచివి. 12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు. దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు. 13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు. మనుష్యులందరిని ఆయన చూశాడు. 14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు. 15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు. ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు. 16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు. ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు. 17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు. తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు. 18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు, ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది. 19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే. ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు. 20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము. ఆయన మనకు సహాయం, మన డాలు. 21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు, నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను. 22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము. కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International