కీర్తన 25 - పవిత్ర బైబిల్దావీదు కీర్తన. 1 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను. 2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను. నేను నిరాశచెందను. నాశత్రువులు నన్ను చూచి నవ్వరు. 3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు. కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు. వారికి ఏమీ దొరకదు. 4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము. నీ మార్గాలను ఉపదేశించుము. 5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము. నీవు నా దేవుడవు, నా రక్షకుడవు. రోజంతా నేను నిన్ను నమ్ముతాను. 6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము. 7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము. 8 యెహోవా నిజంగా మంచివాడు. జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు. 9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు. న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు. 10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి. 11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను. కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు. 12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు. 13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు. అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు. 14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు. ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు. 15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి. ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు. 16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము. 17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము. 18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము. 19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము, నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు. 20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము. నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు. 21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను. కనుక నన్ను కాపాడుము. 22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International