కీర్తన 19 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: దావీదు కీర్తన. 1 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి. యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది. 2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది. ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది. 3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు. మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు. 4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది. వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి. అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది. 5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు. పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు. 6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు, మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది. దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి. 7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం. అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి. యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది. జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది. 8 యెహోవా చట్టాలు సరియైనవి. అవి మనుష్యులను సంతోషపెడ్తాయి. యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి. ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి. 9 యెహోవాను ఆరాధించుట మంచిది. అది నిరంతరము నిలుస్తుంది. యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. అవి సంపూర్ణంగా సరియైనవి. 10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి. సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి. 11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి. నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. 12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు. కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము. 13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము. ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము. నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను. 14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International