సామెతలు 13 - పవిత్ర బైబిల్1 ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కాని గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్మడు. 2 మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు. 3 తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కాని ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు. 4 బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కాని అతడు వాటిని ఎన్నటికీ పొందలేడు. కాని కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు. 5 మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు. 6 మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కాని పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది. 7 కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కాని వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కాని వాస్తవానికి వారు ధనికులు. 8 ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కాని పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు. 9 ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కాని దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు. 10 ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు. 11 డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు. 12 నిరీక్షణ లేకపోతే హృదయానికి దు: ఖం. నీవు కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు. 13 ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే, అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవించేవాడు బహుమానం పొందుతాడు. 14 జ్ఞానముగల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పించుకొనుటకు సహాయం చేస్తాయి. 15 తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కాని ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది. 16 జ్ఞానముగల మనిషి ఏదైనా చేయకముందే అతడు ఆలోచిస్తాడు. అయితే బుద్దిహీనుడు చేసే బుద్దిహీనత వలన అతడు మూర్ఖుడౌతాడు. 17 ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే, అప్పుడు అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నమ్మదగిన వాడైతే శాంతి ఉంటుంది. 18 ఒక వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చుకొనేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు పేదవాడై, సిగ్గుపడతాడు. కాని ఒక మనిషి విమర్శించడినప్పుడు, శిక్షించబడినప్పుడు వినిపించుకొంటే లాభం పొందుతాడు. 19 ఒక మనిషి ఏదైనా కోరుకొని దానిని పొందితే, అతనికి చాలా సంతోషం. కాని మూర్ఖులు కీడునే కోరుకొంటారు. వారు మారుటకు అంగీకరించరు. 20 జ్ఞానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కాని బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు. 21 పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుముతుంది. కాని మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి. 22 మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవలకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డవాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్ల పాలవుతాయి. 23 ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల మంచి భూమి ఉండవచ్చును. కాని అతడు చెడు నిర్ణయాలు చేసి, ఆకలితో ఉంటాడు. 24 ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తే, వారు తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. నీవు నీ కుమారుణ్ణి ప్రేమిస్తే, అతనికి సరైన మార్గం నేర్పించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు. 25 మంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి ఉంటాయి. కాని దుర్మార్గునికి అవసరత కలిగివుంటుంది. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International