సంఖ్యా 28 - పవిత్ర బైబిల్ప్రతిదిన అర్పణలు 1 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వాలి. ప్రత్యేక కానుకలను సరైన సమయంలోనే నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ధాన్యార్పణలు, దహనబలులు నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ఆ దహనబలుల వాసన యెహోవాకు ఇష్టం. 3 వారు యెహోవాకు ఇవ్వవలసిన దహనబలులు ఇవే. ప్రతిరోజూ పుష్టిగల, ఒక సంవత్సరం వయసున్న రెండు మగ గొర్రె పిల్లలు. 4 ఒక గొర్రెపిల్ల ఉదయం, మరో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. 5 మరియు ఒక పావు ఒలీవనూనెతో కలుపబడ్డ రెండుపావుల మంచి పిండి ధాన్యార్పణగా పెట్టాలి.” 6 సీనాయి కొండ దగ్గర వారు ప్రతి దినం అర్పణలు అర్పించటం మొదలుపెట్టారు. ఆ దహనబలి అర్ఫణల వాసన యెహోవాకు ఇష్టమయినది. 7 దహనబలి అర్పణతో బాటు ప్రజలు పానార్పణ కూడ అర్పించాలి. ప్రతి గొర్రె పిల్లతోబాటు వారు ముప్పావు ద్రాక్షారసం అర్పించాలి. పవిత్ర స్థలంలో బలిపీఠం మీద పానార్పణం పోయాలి. ఇది యెహోవాకు కానుక. 8 రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. సరిగ్గా ఉదయార్పణలాగే దీనిని అర్పించాలి. అలాగే అదే రకం పానార్పణం ఇవ్వాలి. ఈ దహనబలి యెహోవాకు సువాసనగా ఉంటుంది. సబ్బాతు అర్పణలు 9 “విశ్రాంతి దినం శనివారం నాడు, ఒక సంవత్సరం వయసుగల లోపంలేని రెండు గొర్రె పిల్లల్ని, తూమెడు పిండిలో రెండు పదోవంతుల మంచి పిండి ఒలీవ నూనెలో కలిపిన పానార్పణం మీరు అర్పించాలి. 10 విశ్రాంతి దినం కోసం ఇది ప్రత్యేక అర్పణ. ప్రతి రోజూ ఇచ్చే అర్పణ, పానార్పణ గాక ఇది అదనం. నెలసరి సమావేశాలు 11 “ప్రతి నెలా మొదటి రోజున ప్రత్యేకమైన దహనబలి మీరు యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలో లోపంలేని రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు ఏడు. 12 మరియు ఒలీవ నూనెతో కలుపబడిన తూమెడు మంచి పిండితో మూడు పదోవంతులను ధాన్యార్పణగా ప్రతి కోడె దూడతోబాటు అర్పించాలి. అలాగే, ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును పొట్టేలుతో బాటు ధాన్యార్పణగా అర్పించాలి. 13 ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును ఒక్కో గొర్రెపిల్లతోబాటు ధాన్యార్పణగా అర్పించాలి. ఇది యెహోవాకు సువాసన ఇచ్చే దహనబలి. 14 ప్రతి కోడె దూడతోబాటు పడిన్నర ద్రాక్షారసం, పొట్టేలుతోబాటు ఒక్క పడి ద్రాక్షారసం, ప్రతి గొర్రెపిల్లతోబాటు ముప్పావు ద్రాక్షారసం పానార్పణం. ఇది సంవత్సరంలో నెలనెలా అర్పించాల్సిన దహనబలి. 15 ప్రతి రోజూ అర్పించే దహనబలి, పానార్పణంగాక ఒక మగ మేకను యెహోవాకు మీరు అర్పించాలి. ఆ మేక పాప పరిహారార్థ బలి. పస్కా పండుగ 16 “మొదటి నెల (నిసాను) పదునాలుగవ రోజున పస్కా. 17 పులియని రొట్టెల పండుగ అదే నెల పది హేనో రోజున ప్రారంభం అవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు ఉంటుంది. పొంగని రొట్టెలు మాత్రమే మీరు తినాలి. 18 ఈ పండుగ మొదటి రోజున మీరు ఒక ప్రత్యేక సభ జరపాలి. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. 19 మీరు యెహోవాకు దహనబలులు అర్పించాలి. దహనబలులు రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, అంగవిహీనం లేని సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు. 20-21 ఒక్కొక్క కోడె దూడతో తూములో మూడు పదివంతులును, పొట్టేలుతో రెండు పది వంతులును, ఒక్కో గొర్రెపిల్లతో, ఒక్కో పదోవంతు మంచి పిండి ఒలీవ నూనెతో కలిపి ధాన్యార్పణంగా పెట్టాలి. 22 ఒక మగ మేకను కూడ మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థబలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది. 23 ప్రతి ఉదయం మీరు అర్పించే దహనబలి అర్పణ కాక ఈ అర్పణలు మీరు అర్పించాలి. 24 “అదే విధంగా ఏడు రోజులపాటు మీరు ఆహార అర్పణలు అర్పించాలి. ప్రతి రోజూ దానిని హోమాంగా మీరు అర్పించాలి. ఈ అర్పణ యెహోవాకు ఇష్టమైన సునాసన. మీరు దహనబలిని, దాని పానార్పణను క్రమంగా అర్పించాలి. ఇవిగాక ఆహారం (ప్రజలకు) మీరు అర్పించాలి. 25 “అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. వారాల పండుగ (పెంతెకొస్తు) 26 “ప్రథమ ఫలాల పండుగలో (వారాల పండుగ) కొత్త ధాన్యంలోనుంచి మీరు ధాన్యార్పణ యెహోవాకు ఇవ్వవలెను. ఆ సమయంలో కూడ మీరు ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేయాలి. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. 27 మీరు దహనబలులు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు మీరు అర్పించాలి. 28 ప్రతి కోడెదూడతోను, నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదోవంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదోవంతులు 29 ఒక్కో గొర్రె పిల్లతో ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి. 30 మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక మగ మేకనుకూడ మీరు బలి ఇవ్వవలెను. 31 రోజువారీ దహనబలులు, ధాన్యార్పణాలు గాక వీటిని మీరు అర్పించాలి. జంతువులు అంగహీనము కానివిగా ఉండేటట్టు తప్పక చూడాలి. పానార్పణం పరిశుభ్రమయినదిగా ఉండాలి. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International