Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 20 - పవిత్ర బైబిల్


మిర్యాము మరణము

1 మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో నివాసం చేసారు. మిర్యాము చనిపోయి, అక్కడే పాతి పెట్టబడింది.


మోషే పొరబాటు

2 ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు.

3 ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది.

4 యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా?

5 ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికిమాలిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీసుకువచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం తాగటానికి నీళ్లు కూడ లేవు.”

6 కనుక మోషే, అహరోను ఆ జనాన్ని విడిచి, సన్నిధి గుడార ద్వారం దగ్గరకు వెళ్లారు. వారు సాష్టాంగపడగా యెహోవా మహిమ ప్రత్యక్షమయింది.

7 యెహోవా మోషేతో మాట్లాడాడు:

8 “నీ సోదరుడు అహరోనును, ఈ జనాన్ని తీసుకుని ఆ బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. ఆ బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన.

9 కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు.

10 అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము” అన్నాడు.

11 మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగారు.

12 అయితే మోషే, అహరోనులతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూచేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను నమ్ముకొన్నట్లుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. అయితే వాళ్లను ఆ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం మీరు కారు.”

13 ఈ స్థలం మెరీబా జలాలు అని పిలువబడింది. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదించారు. ఆయన పవిత్రుడని యెహోవా ఇక్కడనే వారికి చూపించాడు.!


ఇశ్రాయేలీయులను ఎదోము ఆటంకపర్చుట

14 మోషే కాదేషులో ఉన్నప్పుడు, కొందరు మనుష్యులను ఎదోము రాజు దగ్గరకి పంపి ఈలాగు చెప్పమన్నాడు. ఆ సందేశం ఇది: “మీ సోదరులైన ఇశ్రాయేలీయులు మీతో చెప్పేది ఏమంటే: మాకు కలిగిన కష్టాలన్నీ నీకు తెలుసు.

15 చాల సంవత్సరాల క్రిందట మా పూర్వీకులు ఈజిప్టు వెళ్లారు. చాల సంవత్సరాలు మేము అక్కడ జీవించాము. ఈజిప్టు ప్రజలు మా యెడల కృ-రంగా ఉండిరి.

16 అయితే మేము యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవదూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. “ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన కాదేషులో ఉన్నాము.

17 దయచేసి నీ దేశంలో నుంచి మమ్మల్ని ప్రయాణం చేయనివ్వు. పొలాల్లోనుంచి, ద్రాక్షా తోటల్లోనుంచి మేము నడువము. మీ బావుల్లో దేనినుండి మేము నీళ్లు తాగము. రాజమార్గంలో మాత్రమే మేము ప్రయాణం చేస్తాము. ఆ మార్గంనుండి కుడికి గాని ఎడమకు గాని మేము తొలగము. మీ దేశం దాటిపోయేంత వరకు మేము రాజ మార్గాననే వెళ్తాము.”

18 అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలోనుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబిచ్చాడు.

19 ఇశ్రాయేలు ప్రజలు, “మేము రహదారి వెంబడే ప్రయాణం చేస్తాము. మా పశువులు మీ నీళ్లు ఏమైనా తాగితే, దానికి మేము వెల చెల్లిస్తాము. మేము మీ దేశంలోనుంచి నడుస్తాము, అంతే. అంతేగాని, దాన్ని మేము తీసుకోము” అని జవాబిచ్చారు.

20 అయితే, “మేము మిమ్మల్ని మా దేశంలోంచి పోనియ్యము” అని ఎదోము జవాబిచ్చాడు. అప్పుడు ఎదోము రాజు బలంగల విస్తార సైన్యాన్ని సమకూర్చుకొని, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడటానికి వారి మీదికి వెళ్లాడు.

21 ఇశ్రాయేలు ప్రజలను తన దేశంగుండా వెళ్లనిచ్చేందుకు ఎదోము రాజు నిరాకరించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు తిరిగి మరో మార్గంగుండా వెళ్లిపోయారు.


అహరోను మరణం

22 ఇశ్రాయేలు ప్రజలంతా కాదేషు నుండి హోరు కొండకు ప్రయాణం చేసారు.

23 హోరు కొండ ఎదోము సరిహద్దుకు దగ్గర్లో ఉంది. మోషే, అహరోనులతో యెహోవా చెప్పాడు,

24 “అహరోను తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశంలో అతడు ప్రవేశించడు. మోషే, అహరోనూ, మీరు మెరీబా జలాల దగ్గర నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు కాలేదుగనుక నేను మీతో ఇలా చెబుతున్నాను:

25 “అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు కొండమీదికి తీసుకుని రా.

26 అహరోను ప్రత్యేక దుస్తులు అతని దగ్గరనుండి తీసుకుని, అతని కుమారుడైన ఎలియాజరుకు వాటిని తొడిగించు. అహరోను కొండమీద మరణిస్తాడు. అతడు తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు.”

27 యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. మోషే, అహరోను, ఎలియాజరు హోరు కొండ శిఖరం మీదికు వెళ్లారు. వారు వెళ్లటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు.

28 అహరోను వస్త్రాలన్నీ తీసి అతని కుమారుడైన ఎలియాజరు మీద వేసాడు మోషే. అప్పుడు అహరోను ఆ కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే, ఎలియాజరు కొండ దిగి క్రిందికి వచ్చారు.

29 అప్పుడు అహరోను చనిపోయినట్టు ప్రజలంతా తెలుసుకొన్నారు. కనుక ఇశ్రాయేలులో ప్రతి వ్యక్తి 30 రోజులపాటు సంతాపపడ్డాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan