సంఖ్యా 17 - పవిత్ర బైబిల్అహరోను ప్రధాన యాజకుడని దేవుడు రుజువు చేయటం 1 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారి దగ్గరనుండి పన్నెండు చేతికర్రలు తీసుకురా. పన్నెండు వంశాలలో ఒక్కొక్క నాయకుని దగ్గర్నుండి ఒకటి తీసుకో, ఒక్కొక్కరి పేరు ఒక్కో కర్ర మీద వ్రాయి. 3 లేవీ వాళ్ల కర్రమీద అహరోను పేరు వ్రాయి. పన్నెండు వంశాల్లో ప్రతి పెద్దకు ఒక కర్ర ఉండాలి. 4 సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె ఎదుట ఈ చేతి కర్రలను పెట్టు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. 5 ఒక్క మనిషిని నేను ఏర్పాటు చేసుకొంటాను. ఏ మనిషిని నేను ఎంచుకుంటానో నీకు తెలుస్తుంది. ఎందుచేత నంటే అతని కర్రకు కొత్త ఆకులు మొలవటం ప్రారంభమవుతుంది. ఈ విధంగా, ప్రజలు నీకు, నాకు ఎల్లప్పుడు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం నేను ఆపుచేస్తాను.” 6 కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. పెద్దలంతా ఒక్కొక్కరు ఒక కర్ర అతనికి ఇచ్చారు మొత్తం కర్రల సంఖ్య పన్నెండు. ఒక్కో వంశం నాయకుని దగ్గరనుండి ఒక్కో కర్ర వచ్చింది. వాటి మధ్య అహరోను కర్ర ఉంది. 7 మోషే ఆ చేతి కర్రలను సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె దగ్గర యెహోవా ఎదుట ఉంచాడు. 8 ఆ మరునాడు మోషే గుడారంలో ప్రవేశించాడు. లేవీ వంశపు కర్ర, అంటే అహరోను చేతికర్ర కొత్త ఆకులు తొడగటం మొదలు పెట్టినట్టు అతడు చూసాడు. ఆ కర్రకు కొమ్మలుకూడ పెరిగి, బాదంకాయలు కాసింది. 9 కనుక యెహోవా స్థానం నుండి మోషే ఆ కర్రలంటినీ బయటకు తెచ్చాడు. ఆ చేతి కర్రలను ఇశ్రాయేలు ప్రజలకు మోషే చూపించాడు. వాళ్లంతా ఆ కర్రలను చూచి, ఎవరి కర్ర వారు తిరిగి తీసుకున్నారు. 10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అహరోను చేతి కర్రను మళ్లీ గుడారంలో పెట్టు. ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుచున్న ఈ ప్రజలకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. నామీద వారు ఫిర్యాదు చేయటం ఇది ఆపుచేస్తుంది. ఈ విధంగా వారు చావకుండా ఉంటారు.” 11 కనుక మోషే తనకు యెహోవా చెప్పినట్టు చేసాడు. 12 ఇశ్రాయేలు ప్రజలు మేము “చనిపోతామని మాకు తెలుసు. మేము నశించిపోయాము. మేము అంతా నశించిపోయాము. 13 ఎవరైనా యెహోవా పవిత్ర స్థలం సమీపంగా వచ్చినా సరే చస్తారు. మేము అందరము చనిపోతామా?” అని మోషేతో అన్నారు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International