Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నహూము 2 - పవిత్ర బైబిల్


నీనెవె నాశనం చేయబడుతుంది

1 నీనెవె, నీతో యుద్ధం చేయటానికి వినాశకారుడు వస్తున్నాడు. కావున నీ నగరపు బలమైన ప్రదేశాలను కాపాడుకో, మార్గంపై నిఘా పెట్టు. యుద్ధానికి సిద్ధం కమ్ము. పోరాటానికి సన్నాహాలు చెయ్యి!

2 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రభావంవలె యాకోబుకు తన ప్రభావాన్ని యెహోవా తిరిగి ఇస్తున్నాడు. అష్షూరీయులు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేశారు. వారి ద్రాక్షాచెట్లను నాశనం చేశారు.

3 ఆ సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. వారి దుస్తులు మిరుమిట్లు గొలిపేటంత ఎర్రగా ఉన్నాయి. వారి రథాలు యుద్ధానికి బారులు తీర్చబడి, అగ్ని శిఖల్లా మెరుస్తున్నాయి. వారి గుర్రాలు స్వారీకి సిద్ధంగా ఉన్నాయి!

4 రథాలు వీధులలో దూసుకు పోతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో అవి ముందుకు, వెనుకకు పోతున్నాయి. అవి మండే దివిటీల్లా, ఒక చోటనుండి మరొక చోటికి ప్రసరించే మెరుపుల్లా కనిపించాయి!

5 అష్షూరు రాజు తన మంచి సైనికులందరినీ పిలుస్తాడు. కాని వారు తొట్రిల్లి దారిలో పడిపోతారు. గోడను రక్షించటానికి వారు దాని వద్దకు పరుగెడతారు. రక్షక కవచాన్ని వారు కిందికి దించుతారు.

6 కాని నదివైపు ద్వారాలు తెరచి ఉన్నాయి. శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు.

7 శత్రువు రాణిని ఎత్తుకు పోతాడు. ఆమె దాసీలు పావురాల్లా విచారంగా మూల్గుతారు. వారు విచారాన్ని వ్యక్తపరుస్తూ తమ రొమ్ములు బాదుకుంటారు.

8 నీరు బయటకు కారిపోతే ఉండే ఒక మడుగులా నీనెవె నగరం ఉంది. ప్రజలు, “ఆగండి! పారిపోవటం మానండి!” అని అరుస్తారు. కాని ఎవ్వడూ ఆగడు. వారు చెప్పేదాన్ని ఎవ్వరూ. లక్ష్యపెట్టరు!

9 నీనెవెను నాశనం చేస్తున్న సైనికులారా, వెండిని తీసుకోండి! బంగారాన్ని దోచుకోండి! తీసుకోటానికి అనేక వస్తువులున్నాయి. ఎన్నో ధనాగారాలున్నాయి!

10 ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది. ప్రతీదీ దోచుకోబడింది. నగరం నాశనం చేయబడింది! ప్రజలు వారి ధైర్యాన్ని కోల్పోయారు. వారి హృదయాలు భయంతో వికలమవుతున్నాయి. వారి మోకాళ్ళు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. వారి శరీరాలు వణుకుతున్నాయి వారి ముఖాలు భయంతో వెలవెల పోతున్నాయి.

11 సింహపు గుహ (నీనెవె) ఇప్పుడు ఎక్కడుంది? ఆడ, మగ సింహాలు అక్కడ నివసించాయి. వాటి పిల్లలు భయపడలేదు.

12 ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి పర్చటానికి అనేక మంది మనుష్యులను చంపింది. అతడు తన గుహను (నీనెవె) మానవకళేబరాలతో నింపివేశాడు. అతడు తాను చంపిన స్త్రీలతో తన గుహను నింపాడు.

13 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “నీనెవే, నేను నీకు వ్యతిరేకిని! నీ రథాలను నేను తగులబెడతాను. యుద్ధంలో నీ ‘యువ సింహాలను’ నేను చంపుతాను. భూమి మీద మరెన్నడూ నీవు ఎవరినీ వెంటాడవు. నీ దూతలు చెప్పేవాటిని ప్రజలు మరెన్నడూ వినరు.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan