Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మీకా 7 - పవిత్ర బైబిల్


ప్రజల దుష్కార్యాలపట్ల మీకా కలత చెందటం

1 నేను కలత చెందాను! ఎందుకంటే, నేను సేకరించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను. పండిపోయిన ద్రాక్షాపండ్లవలె ఉన్నాను. తినటానికి ద్రాక్షాపండ్లు మిగలలేదు. నేను కాంక్షించే తొలి అంజూరపు పండ్లు లేనేలేవు.

2 అనగా విశ్వాసంగల జనులంతా పోయారు. ఈ దేశంలో మంచివాళ్లంటూ ఎవ్వరూ మిగలలేదు. ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటానికి వేచివున్నాడు. ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటోపాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు.

3 ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు. అధిపతులు లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు. “ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు.

4 వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు. వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్లపొద కంటే చాలా కంటకుడై ఉంటాడు. నీ ప్రవక్తలు ఈ రోజు వస్తుందని చెప్పారు. నీ కావలివాండ్ర దినం రానేవచ్చింది. ఇప్పుడు నీవు శిక్షింపబడతావు! ఇప్పుడు నీవు కలవరపడతావు!


శిక్షపడే రోజు వస్తూవుంది.

5 నీ పొరుగువానిని నమ్మవద్దు! స్నేహితుని నమ్మవద్దు! నీ భార్యతో సహితం నీవు స్వేచ్చగా మాట్లాడవద్దు!

6 తన ఇంటివారే తనకు శత్రువులవుతారు. ఒక కుమారుడు తన తండ్రిని గౌరవించడు. ఒక కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది. ఒక కోడలు తన అత్తపై తిరుగబడుతుంది.


యెహోవా రక్షకుడు

7 కావున సహాయంకొరకు నేను యెహోవాతట్టు చూస్తాను. నాకు సహాయం చేయటానికి నేను యెహోవాకొరకు నిరీక్షిస్తాను. నా దేవుడు నా మొర ఆలకిస్తాడు.

8 నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువా, నన్ను చూచి నవ్వకు! నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ యెహోవాయే నాకు వెలుగు.


యెహోవా క్షమిస్తాడు

9 నేను యెహోవాపట్ల పాపం చేశాను. అందువల్ల ఆయన నేనంటే కోపంగా ఉన్నాడు. కానీ న్యాయస్థానంలో ఆయన నా తరఫున వాదిస్తాడు. నాకు మంచి జరిగే పనులు ఆయన చేస్తాడు. పిమ్మట ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తాడు. ఆయన చేసింది న్యాయమైనదని నేను గ్రహిస్తాను.

10 నా శత్రువు ఇది చూసి సిగ్గుపడతాడు. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నడిగాడు. ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టిమీద నడిచినట్లు జనులు ఆమెమీద నడుస్తారు.


యూదులు తిరిగిరావటం

11 నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది. ఆ సమయంలో వారి దేశం విస్తరిస్తుంది.

12 నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు. అష్షూరునుండి, ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు. నీ దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు నదివరకు, పడమట సముద్రంనుండి తూర్పున పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది.

13 దేశం పాడైపోయింది. దానిలో నివసించే జనులవల్ల, వారు చేసిన పనులవల్ల అది పాడైపోయింది.

14 కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు. నీకు చెందిన ప్రజాసమూహాన్ని పాలించు. ఆ మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు పర్వతం మీదనూ ఒంటరిగా ఉంటుంది. గతంలో మాదిరి ఆ మంద బాషానులోనూ, గిలాదులోనూ నివసిస్తుంది.


ఇశ్రయేలు తన శత్రువులను ఓడించటం

15 నేను నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరిపించాను. ఆ రకంగా మీరింకా ఎన్నో అద్భుత కార్యాలు చూసేలా చేస్తాను.

16 అన్యజనులు ఆ అద్భుతకార్యాలు చూసి, సిగ్గుపడతారు. వారి “శక్తి” నాశక్తితో పోల్చినప్పుడు వ్యర్థమైనదని వారు గ్రహిస్తారు. వారు విస్మయం చెంది, వారి నోళ్లపై చేతులు వేసుకుంటారు! వారు చెవులు మూసుకొని, వినటానికి నిరాకరిస్తారు.

17 వారు పాములా మట్టిలో పాకుతారు. వారు భయంతో వణుకుతారు. తమ బొరియల్లోనుంచి బయటకు వచ్చే కీటకాలవలె, వారు నేలమీద పాకుతారు. వారు భయపడి, దేవుడైన యెహోవా వద్దకు వస్తారు. నీముందు వారు భయపడతారు!


యెహోవాకు స్తుతి

18 నీవంటి దేవుడు మరొకడు లేడు. పాపం చేసిన దోషులను నీవు క్షమిస్తావు. నీ ప్రజలలో మిగిలినవారి పాపాలవైపు నీవు చూడవు. దేవుడైన యెహోవా కోపం శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ఆయన కనికరం చూపటానికి ఇష్టపడతాడు.

19 యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను పరిహరించు. మా పాపాలన్నిటినీ లోతైన సముద్రంలోకి విసిరివేయి.

20 దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా ఉంటావు. అబ్రహాము యెడల దయకలిగి యుంటావు. ఎందుకంటే మా పూర్వీకులకు పురాతన కాలమందు నీవు వాగ్దానం చేశావు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan