Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మీకా 6 - పవిత్ర బైబిల్


యెహోవా ఫిర్యాదు

1 యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను. నీవు లేచి, పర్వతాలముందు నిలబడు. వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.

2 తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది. పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి. భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి. ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!

3 యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను? మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను? మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి!

4 నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను! ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్మల్ని నేను తీసుకువచ్చాను. మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను. నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను.

5 నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి. బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి. అకాసియ (షిత్తీము) నుండి గిల్గాలువరకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు యెహోవా న్యాయ వర్తనుడని మీరు తెలుసుకుంటారు!”


దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?

6 దేవుడైన యెహోవా సన్నిధికి నేను వచ్చినప్పుడు, నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి? ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా?

7 యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా? నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్ని బలి ఇవ్వనా? నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో భాగంగా పుట్టిన శిశువును అర్పించనా?

8 మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు. యెహోవా నీనుండి కోరేవి ఇవి: ఇతరులపట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు. ప్రజలపట్ల ప్రేమ, దయ కలిగిఉండటానికి ఇష్టపడు. అణకువ కలిగి నీ దేవునితో జీవించు.


ఇశ్రాయేలీయులు ఏమి చేస్తున్నారు?

9 దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేమును) పిలుస్తూవుంది. తెలివిగల మనుష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు. కావున శిక్షించే దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవానిపట్ల ధ్యానముంచు!

10 దుష్టులు తాము దొంగిలించిన ధనరాశులను ఇంకా దాస్తున్నారా? దుష్టులు ఇంకా మరీ చిన్న బుట్టలతో జనాన్ని మోసగిస్తున్నారా? అలా ప్రజలను మోసగించే విధానాలను యెహోవా అసహ్యించుకుంటాడు!

11 దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు, తప్పుడు తూనికలతో ప్రజలను మోసగిస్తున్నారా? తప్పుడు కొలతలు కొలవటానికి వారింకా దొంగ తూకపురాళ్లు, దొంగ కొలతలుగల సంచులు కలిగియున్నారా? అవును! అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి!

12 ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు! ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు! అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు!

13 కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను. నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను.

14 నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు. నీ కడుపు ఖాళీగా ఉండి, నీవు ఇంకా ఆకలితో ఉంటావు. నీవు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి ప్రయత్నిస్తావు. కాని కత్తులు పట్టిన జనులు నీవు కాపాడిన జనులను చంపుతారు, నిన్ను పట్టుకుంటారు.

15 నీవు విత్తనాలు చల్లుతావు; కానీ నీవు పంట కోయలేవు. ఒలీవ గింజలను గానుగ పడతావు; కానీ నీకు నూనె రాదు. నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి నీవు అనుమతింపబడవు.

16 ఎందుకంటే నీవు ఒమ్రీ నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ, అహాబు వంశంవారు చేసిన చెడు పనులన్నీ చేస్తున్నావు. నీవు వారి బోధలను పాటిస్తున్నావు. అందువల్ల నీవు నాశనమయ్యేలా చేస్తాను. నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు. చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపోబడతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan