Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మీకా 5 - పవిత్ర బైబిల్

1 కావున, బలమైన నగరమా, నీ సైన్యాలను సమీకరించు. నీ శత్రువులు ముట్టడించటానికి కూడుకుంటున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని చెంపమీద కొడతారు.


బెత్లెహేములో మెస్సీయ పుట్టుక

2 కాని, బేత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదాలో అతి చిన్న గ్రామానివి. నీ వంశం లెక్కపెట్టటానికి కూడా అతి చిన్నది. అయినప్పటికీ, నీ నుండే నా “ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు. ఆయన ఆరంభం (ఉనికి) పురాతన కాలంనుండి, అనాది కాలంనుండి ఉంటూవుంది.

3 యెహోవా తన ప్రజలను బబులోను (బాబిలోనియా)లో ఉండనిస్తాడు. స్త్రీ ప్రసవించేదాకా వారక్కడ ఉంటారు. అప్పుడు ఇంకా బతికివున్న అతని సోదరులు తిరిగివస్తారు. వారు ఇశ్రాయేలు ప్రజలవద్దకు తిరిగివస్తారు.

4 అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన మందను మేపుతాడు. యెహోవా తన శక్తితోను; దేవుడైన యెహోవా తన అద్భుత నామ మహత్తుతోను వారిని నడిపించుతాడు. వారు నిర్భయంగా జీవిస్తారు. ఎందువల్లనంటే, ఆ సమయంలో ఆయన గొప్పతనం భూమి అంచులదాకా వ్యాపిస్తుంది.

5 శాంతి నెలకొంటుంది. అష్షూరు సైన్యం మన దేశంలోకి వస్తుంది. ఆ సైన్యం మన పెద్ద ఇండ్లను నాశనంచేస్తుంది. కాని ఇశ్రాయేలు పాలకుడు ఏడుగురు గొర్రెల కాపరులను ఎంపికచేస్తాడు. కాదు, ఆయన ఎనమండుగురు నాయకులనుఎంపిక చేస్తాడు.

6 వారు తమ కత్తులను ఉపయోగించి, అష్షూరువారిని పాలిస్తారు. వారు తమ స్వంత నగరాలనుండి నిమ్రోదుదేశాన్ని పాలిస్తారు. ఆ ప్రజలను పాలించటానికి వారు తమ కత్తులను ఉపయోగిస్తారు. అప్పుడు ఇశ్రాయేలు పాలకుడు మనలను అష్షూరీయులనుండి రక్షిస్తాడు. ఆ ప్రజలు మన రాజ్యంలోకి వస్తారు. వారు మన ప్రాంతాన్ని తమ కాళ్ళకింద త్రొక్కుతారు.

7 యాకోబు సంతతిలో మిగిలినవారు, చాలామంది ప్రజలకు యెహోవా కురిపించే మంచులా ఉంటారు. వారు పచ్చిగడ్డిపై పడే వర్షంలా ఉంటారు. వారు ఏ మనిషి కోసమూ వేచి ఉండరు. వారు ఎవరికీ భయపడరు.

8 అడవి జంతువుల మధ్య సింహం ఎలా ఉంటుందో, యాకోబు సంతతిలో మిగిలినవారు, చాలామంది ప్రజలకు అలా ఉంటారు. గొర్రెలమందల్లో చొరబడిన కొదమసింహంలా వారుంటారు. సింహం నడుచుకుంటూ వెళ్లినప్పుడు అది ఎటు వెళ్లదలిస్తే అటు వెళుతుంది. అది ఒక జంతువును ఎదుర్కొన్నప్పుడు ఎవ్వడూ దానిని అదుపు చేయలేడు. మిగిలి ఉన్న జనులు అటువంటి సింహంలా ఉంటారు.

9 మీరు మీ చేతిని మీ శత్రువులపైకి ఎత్తి, వారిని నాశనం చేస్తారు.


ప్రజలు దేవునిపై ఆధారపడుట

10 దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో మీ గుర్రాలను మీవద్దనుండి తీసుకుంటాను. మీ రథాలను నాశనంచేస్తాను.

11 మీ దేశంలోగల నగరాలను నేను నాశనం చేస్తాను. మీ కోటలన్నిటినీ కూలగొడతాను.

12 మీరిక ఎంతమాత్రం మంత్రతంత్రాలు చేయ ప్రయత్నించరు. భవిష్యత్తును చెప్ప యత్నించే జనులు మీకిక ఉండబోరు.

13 మీ బూటకపు దేవుళ్ల విగ్రహాలను నేను నాశనం చేస్తాను. ఆ బూటకపు దేవుళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రాళ్లను నేను పడగొడతాను. నీ చేతులు చేసిన వస్తువులను నీవు ఆరాధించవు.

14 అషేరా దేవతను ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన స్తంభాలను లాగివేస్తాను. మీ బూటకపు దేవుళ్లను నేను నాశనం చేస్తాను.

15 కొంతమంది మనుష్యులు నా మాట వినరు. నేను నా కోపాన్ని చూపిస్తాను. ఆ జనులకు నేను ప్రతీకారం చేస్తాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan