మీకా 3 - పవిత్ర బైబిల్ఇశ్రాయేలు నాయకుల పాప దోషం 1 అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి. న్యాయమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి! 2 కాని మీరు మంచిని ద్వేషించి, చెడును ప్రేమిస్తారు! మీరు వారి ప్రజల చర్మాన్ని ఒలుస్తారు. మీరు వారి ఎముకలపై గల మాంసాన్ని లాగివేస్తారు! 3 మీరు నా ప్రజలను నాశనం చేస్తున్నారు! మీరు వారి చర్మాన్ని ఒలుచుకుంటున్నారు; వారి ఎముకలను విరుగ గొడుతున్నారు. మాంసంలా వారి ఎముకలను కుండలో పెట్టటానికి మీరు నరుకుతారు! 4 అప్పుడు మీరు దేవుడైన యెహోవాను ప్రార్థిస్తారు. కాని ఆయన మీ ప్రార్థన వినడు; దేవుడైన యెహోవా మిమ్మల్ని చూచి ముఖం తిప్పుకుంటాడు. ఎందుకంటే మీరు చెడుపనులు చేశారు!” బూటకపు ప్రవక్తలు 5 అబద్ధ ప్రవక్తలు యెహోవా ప్రజలకు తప్పుడు జీవిత విధానాన్ని బోధిస్తారు. యెహోవా ఆ ప్రవక్తల విషయంలో ఈ విధంగా చెపుతున్నాడు: “ప్రజలు గనుక ఈ ప్రవక్తలకు తినటానికి ఆహారం ఇస్తే వారు శాంతి అని అరుస్తారు! ఒకవేళ ప్రజలు వారికి ఆహారం ఇవ్వకపోతే, అప్పుడు ప్రవక్తలు ‘యుద్ధానికి సిద్ధంకండి’ అని అరుస్తారు. 6 “అందువల్ల మీకు చీకటి కమ్మినట్లు ఉంటుంది. మీకు దర్శనాలు కలుగవు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీరు చెప్పలేరు గనుక. మీకు అంధకారం వ్యాపించినట్లు ఉంటుంది. ఈ ప్రవక్తలకు సూర్యుడు అస్తమిస్తాడు. వారికి పట్టపగలే అంధకారం ఆవరిస్తుంది. 7 దీర్ఘదర్శులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు. భవిష్యత్తును చూసేవారు కలవరపాటు చెందుతారు. అవును, వారంతా వారి నోళ్లు మూసుకుంటారు. ఎందుకంటే దేవునివద్దనుండి సమాధానం రాదు!” మీకా దేవుని యదార్థ ప్రవక్త 8 కానీ యెహోవా ఆత్మ నన్ను శక్తితోను, మంచితనంతోను, బలంతోను నింపివేశాడు. కావున నేను యాకోబుకు అతని పాపాలనుగూర్చి చెప్పగలను. అవును. ఇశ్రాయేలుకు అతను చేసిన పాపాలను గురించి నేను చెపుతాను! ఇశ్రాయేలు నాయకులు నింద పాలవటం 9 యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి! మీరు న్యాయాన్ని ద్వేషిస్తారు. మీరు తిన్నగా ఉన్నదానిని వంకర చేస్తారు! 10 మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు! మీరు యెరూషలేమును పాపంతో నిర్మించారు! 11 యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు. వారలా చేసి న్యాయస్థానంలో తమ తీర్పు ఇస్తారు. ప్రజలకు బోధించేముందు యెరూషలేము యాజకులకు వేతనం చెల్లించాలి. ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసేముందు ప్రజలు వారికి డబ్బు చెల్లించాలి. అప్పుడా నాయకులు, “మనకు ఏరకమైన కీడూ రాదు! యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు. 12 మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది. అది దున్నిన పొలంలా తయారవుతుంది. యెరూషలేము రాళ్ల గుట్టలా మారుతుంది. ఆలయపు పర్వతం పొదలతో నిండిన వట్టి కొండలా తయారవుతుంది. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International