Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 24 - పవిత్ర బైబిల్


దీపస్తంభం, పవిత్ర రొట్టెలు

1 మోషేతో యెహోవా చెప్పాడు:

2 “గానుగ ఆడిన ఒలీవలనుండి పవిత్ర తైలం తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ఆ నూనె దీపాల కోసం. ఆ దీపాలు ఆరిపోకుండా వెలగాలి.

3 సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట సాయంత్రం నుండి ఉదయం వరకు దీపం వెలిగేటట్లు అహరోను చూసుకొంటాడు. ఇది సాక్ష్యపు తెర ఎదుట ఉంటుంది. అతి పవిత్రస్థలంలో ఈ తెర వెనుకనే ఒడంబడిక పెట్టె ఉంటుంది. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.

4 యెహోవా ఎదుట స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం మీద దీపాలను అహరోను ఎల్లప్పుడూ వెలగనిస్తూఉండాలి.

5 “మంచి రకం గోధుమ పిండి తీసుకొని, దానితో పన్నెండు రొట్టెలు చేయాలి. ఒక్కో రొట్టెకు నాలుగు పావుల గోధుమపిండి ఉపయోగించాలి.

6 యెహోవా ఎదుట బంగారు బల్లమీద ఆ రొట్టెలను రెండు వరుసలుగా పెట్టాలి. ఒక్కో వరుసలో ఆరు రొట్టెలు ఉండాలి.

7 ఒక్కో వరుసమీద స్వచ్ఛమైన సాంబ్రాణి వేయాలి. ఇది యెహోవాకు అర్పించబడిన హోమాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకొనేట్టు చేస్తుంది.

8 ప్రతి సబ్బాతు నాడు అహరోను ఈ రొట్టెలను యెహోవా ఎదుట క్రమంలో ఉంచాలి. శాశ్వతంగా ఇలా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక ఎప్పటికీ కొనసాగుతుంది.

9 ఆ రొట్టె అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. వారు ఈ రొట్టెను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే యెహోవాకు హోమంగా అర్పించబడిన అర్పణల్లో అది ఒకటి. ఆ రొట్టె ఎప్పటికీ అహరోను భాగం అవుతుంది.”


దేవుణ్ణి శపించిన మనిషి

10 ఒక ఇశ్రాయేలు స్త్రీకి కుమారుడు ఒకడు ఉన్నాడు. వాని తండ్రి ఈజిప్టువాడు. ఈ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు ఇశ్రాయేలువాడే. అతడు ఇశ్రాయేలు ప్రజల మధ్య తిరుగుతూ, బసలో పోరాడటం మొదలుపెట్టాడు.

11 ఆ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని శపిస్తూ, దూషణ మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు కనుక ప్రజలు అతణ్ణి మోషే దగ్గరకు తీసుకొని వచ్చారు. (అతని తల్లి పేరు షెలోమితు, దాను కుటుంబ వంశానికి చెందిన దిబ్రీ కుమార్తె)

12 ప్రజలు వాణ్ణి బందీగా పట్టి, యెహోవా ఆజ్ఞ వివరంగా తెలియటం కోసం కనిపెట్టారు.

13 అప్పుడు మోషేతో యెహోవా చెప్పాడు:

14 “ఆ శపించినవాణ్ణి బసవెలుపలికి తీసుకొని రండి. తర్వాత అతడు శపిస్తూండగా విన్న ప్రజలందర్నీ సమావేశ పరచండి. వాళ్లు అతని తలమీద చేతులు వేయాలి. తర్వాత ప్రజలంతా వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి.

15 ఇశ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు: ఎవడైనా తన దేవుణ్ణి శపిస్తే వాడు ఈ విధంగా శిక్షించబడాలి.

16 యెహోవా నామానికి వ్యతిరేకంగా ఎవరైనా దూషణచేస్తే, వాణ్ణి చంపివేయాలి, ప్రజలంతా వాణ్ణి రాళ్ళతో కొట్టాలి. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడిలాగానే, విదేశీయులు కూడా శిక్షించబడాలి. ఏ వ్యక్తిగాని యెహోవా నామాన్ని శపిస్తే ఆ వ్యక్తిని చంపివేయాలి.

17 “ఇంకా, ఒకడు మరొక వ్యక్తిని చంపేస్తే, అలాంటివాణ్ణి చంపివేయాలి.

18 మరొకరికి చెందిన జంతువును చంపినవాడు ఆ జంతువుకు బదులుగా మరొక జంతువును ఇవ్వాలి.

19 “ఒకడు తన పొరుగువానికి గాయం చేస్తే, వానికి కూడా అలానే చేయాలి.

20 విరిగిన ఎముకకు విరిగిన ఎముక, కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకనికి ఎలాంటి దెబ్బలు తగిలితే, వాటి కారకునికి గూడా అలాంటి దెబ్బలే.

21 కనుక ఒకని జంతువును చంపినవాడు దాని స్థానంలో మరో జంతువును ఇవ్వాలి. అయితే మరొకడ్ని చంపినవాణ్ణి మాత్రం చంపివేయాలి.

22 “మీకు ఒకే రకం న్యాయం ఉంటుంది. మీ స్వంత దేశంలో ఉండే విదేశీయునికి కూడా అదే న్యాయం ఉంటుంది. ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక.”

23 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడగా, శపించిన వ్యక్తిని బసవెలుపలకు వారు తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్లు రాళ్లతో కొట్టి అతణ్ణి చంపివేసారు. కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan