Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 21 - పవిత్ర బైబిల్


యాజకుల నియమాలు

1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

2 “యాజకులైన అహరోను కుమారులతో ఈ విషయాలు చెప్పు: అహరోను కుమారులు, యాజకులు. చనిపోయినవారి శవాల్ని తాకి యాజకుడు అపవిత్రుడు కాకూడదు.

3 అయితే చనిపోయిన వ్యక్తి గనుక తన రక్త సంబంధీకుడైతే. అప్పుడు అతడు ఆ శవాన్ని తాకవచ్చు. చనిపోయిన వ్యక్తి యాజకుని తల్లి లేక తండ్రి, కుమారుడు లేక కుమార్తె, సోదరుడు లేక అవివాహిత సోదరి అయితే యాజకుడు అపవిత్రం కావచ్చు. (ఈ సోదరికి భర్త లేడు గనుక ఆమె అతనికి చాలా దగ్గర అవుతుంది. కనుక ఆమె మరణిస్తే, ఆమెకోసం యాజకుడు మైల పడవచ్చు).

4 కానీ చనిపోయిన వ్యక్తి యాజకుని బానిసల్లో ఒక వ్యక్తి అయితే మాత్రం యాజకుడు మైలపడకూడదు.

5 “యాజకులు వారి తలలు గుండు గీసికోగూడదు. యాజకులు వారి గడ్డాల కొనలు కత్తిరించగూడదు. యాజకులు వారి దేహాల్లో ఎక్కడా కోసుకోగూడదు.

6 యాజకులు వారి దేవుని కోసం పవిత్రంగా ఉండాలి. దేవుని పేరంటే వారు భక్తి చూపించాలి. ఎందుచేతనంటే వారు నైవేద్యం, హోమం దేవునికి అర్పించువారు. కనుక వారు పవిత్రంగా ఉండాలి.

7 “యాజకుడు దేవుణ్ణి ప్రత్యేకంగా సేవించేవాడు. అందుచేత మరో మగవాడితో లైంగిక సంబంధం ఉన్న స్త్రీని యాజకుడు వివాహం చేసుకోగూడదు. వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని యాజకుడు వివాహం చేసుకోగూడదు.

8 యాజకుడు ప్రత్యేక విధానంలో దేవుణ్ణి సేవించేవాడు. కనుక మీరు అతణ్ణి ప్రత్యేక విధానంలో చూసుకోవాలి. ఎందుచేతనంటే అతడు పవిత్ర వస్తువుల్ని మోసేవాడు, పవిత్ర రొట్టెల్ని అతడు దేవునికి తీసుకొనివస్తాడు గనుక. నేను పరిశుద్ధుడను. నేను యెహోవాను, మరియు నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను.

9 “ఒక యాజకుని కుమార్తె వేశ్య అయితే ఆమె తన పేరును నాశనం చేసికొంటుంది, తన తండ్రికి అవమానం కలిగిస్తుంది. కనుక ఆమెను కాల్చివేయాలి.

10 “ప్రధాన యాజకుడు తన సోదరుల్లోనుంచి ఎంపిక చేయబడినవాడు. అతని తలమీద అభిషేకతైలం పోయబడింది. ఈ విధంగా అతడు ప్రధాన యాజకునిగా ప్రత్యేక పనికి నియమించబడ్డాడు. ప్రత్యేక వస్త్రాలు ధరించేందుకు అతడు ఏర్పాటు చేయబడ్డాడు. కనుక అతడు తన విచారాన్ని బాహాటంగా చూపించే పనులు చేయకూడదు. అతడు తన తల వెంట్రుకలను చింపిరిజుట్టుగా పెరగ నివ్వకూడదు. అతడు తన బట్టలు చింపుకోగూడదు.

11 మృత దేహాన్ని తాకి అతడు అపవిత్రుడు కాకూడదు. అతని స్వంత తండ్రి, తల్లి చనిపోయినా సరే అతడు ఆ శవాన్ని తాకగూడదు.

12 ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంనుండి బయటకు వెళ్లగూడదు. అతడు అలా గనుకచేస్తే, అతడు అపవిత్రుడై, తర్వాత దేవుని పరిశుద్ధ స్థలాన్ని అతడు అపవిత్రం చేయవచ్చు. ప్రధాన యాజకుని తలమీద ప్రత్యేక తైలం పోయబడింది. ఇదే అతణ్ణి మిగిలిన ప్రజలకంటే ప్రత్యేకం చేసింది. నేను పరిశుద్ధుడైన యెహోవాను.

13 “ప్రధాన యాజకుడు కన్యగా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి.

14 ఇదివరకే మరొకనితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న స్త్రీని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ఒక వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని, లేక విధవరాలిని గాని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ప్రధాన యాజకుడు తన స్వంత ప్రజల్లోనే ఒక కన్యను వివాహం చేసుకోవాలి.

15 ఈ విధంగా ప్రజలు అతని పిల్లలకు మర్యాదనిస్తారు. ప్రధాన యాజకుణ్ణి అతని ప్రత్యేక పని నిమిత్తం యెహోవానగు నేనే ప్రత్యేకించాను.”

16 మోషేతో యెహోవా చెప్పాడు:

17 “అహరోనుతో చెప్పు: నీ సంతానంలోని పిల్లలు ఎవరైనాసరే ఏదైనా శారీరక లోపం గలవారైతే వారు దేవునికి ప్రత్యేక రొట్టెలు తీసుకొని వెళ్లకూడదు.

18 అంగవిహీనం ఉన్న ఏ మనిషికూడ యాజకునిగా నాకు సేవ చేయకూడదు, నాకు బలులు అర్పించకూడదు. ఎలాంటివారు యాజకులుగా నన్ను సేవించగూడదు అంటే: గుడ్డి వాళ్లు, కుంటివాళ్లు, పాడైపోయిన ముఖం ఉన్నవాళ్లు, చేతులుగాని కాళ్లుగాని విపరీతంగా పొడవు ఉన్నవాళ్లు,

19 కాలైనా, చేయైనా విరిగినవాళ్లు,

20 గూనివాళ్లు, మరుగుజ్జువాళ్లు, కంటిలో లోపాలు ఉన్నవాళ్లు, దురద లేక చర్మ వ్యాధి ఉన్నవాళ్లు, అణగగొట్టబడిన వృషణాలు ఉన్నవాళ్లు.

21 “అహరోను సంతానంలో ఎవరిలోనైనా ఏదోషమైనా ఉంటే అలాంటి వ్యక్తి యెహోవాకు హోమ అర్పణలు అర్పంచకూడదు. ఆ వ్యక్తి ప్రత్యేక రొట్టెల్ని కూడా దేవునికి తీసుకొని వెళ్ల కూడదు.

22 ఆ వ్యక్తి యాజక కుటుంబంలోని వాడు గనుక అతడు పవిత్ర రొట్టెల్ని తినవచ్చును. అతి పవిత్రమైన రొట్టెల్ని కూడా అతడు తినవచ్చును.

23 కానీ అతడు మాత్రం తెరలోపలి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు గూడ అతడు వెళ్లగూడదు. ఎందుచేతనంటే అతనిలో ఏదో తప్పు ఉంది. అతడు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను ఆ స్థలాల్ని పరిశుద్ధం చేస్తాను!”

24 కనుక అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఈ సంగతులు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan