Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 20 - పవిత్ర బైబిల్


విగ్రహారాధనగూర్చి హెచ్చరిక

1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

2 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు కూడా నీవు చెప్పాలి: మీ దేశంలో ఒక వ్యక్తి తన పిల్లలలో ఒకరిని దొంగదేవత మోలెకునకు అర్పించడం జరగవచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని చంపెయ్యాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడైనా లేక ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయుడైనా సరే, ఆ వ్యక్తిమీద మీరు రాళ్లు విసిరి చంపివేయాలి.

3 నేను ఆ వ్యక్తికి విముఖుడ్ని. అతణ్ణి అతని ప్రజల్లోనుంచి నేను వేరుచేస్తాను. ఎందుచేతనంటే అతడు తన పిల్లల్ని మోలెకునకు ఇచ్చాడు. నా పవిత్ర నామం అంటే అతనికి గౌరవం లేదని అతడు వ్యక్తం చేసాడు. నా పవిత్ర స్థలాన్ని అతడు అపవిత్రం చేసాడు.

4 ఒకవేళ సామాన్యులు అతణ్ణి పట్టించుకోక పోవచ్చు, ఒకవేళ తన పిల్లల్ని మోలెకునకు అర్పించినవాణ్ణి వారు పట్టించు కొనక పోవచ్చును,

5 కానీ నేను మాత్రం అతనికి, అతని కుటుంబానికి విరోధంగా ఉంటాను. అతణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరుచేసేస్తాను. నాకు అపనమ్మకంగా ఉండి, మోలెకును వెంబడించే ఏ వ్యక్తినైనా సరే నేను వేరు చేసేస్తాను.

6 “సలహాకోసం కర్ణపిశాచుల దగ్గరకు, సోదె చెప్పేవారి దగ్గరకు వెళ్ళే ఏ వ్యక్తికైనా సరే నేను విరోధంగా ఉంటాను. అలాంటి వ్యక్తి నాకు అపనమ్మకంగా ఉన్నాడు. కనుక అలాంటి వాణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరు చేసేస్తాను.

7 “ప్రత్యేకంగా ఉండండి. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. ఎందుచేతనంటే నేను పవిత్రుడను గనుక. నేను యెహోవాను మీ దేవుణ్ణి.

8 నా ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని విధేయులుగా ఉండండి. నేను యెహోవాను మరియు నా ప్రత్యేక ప్రజలుగా నేను మిమ్మల్ని చేసాను.

9 “ఏ వ్యక్తిగాని తన తండ్రిని లేక తల్లిని శపించినట్లయితే ఆ వ్యక్తిని చంపేయాలి. అతడు తన తండ్రిని లేక తల్లిని శపించాడు గనుక అతణ్ణి చెంపేయాల్సిందే.


లైంగిక పాపాలకు శిక్ష

10 “మగవాడు ఒకడు తన పొరుగువాని భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాడు ఆడది ఇద్దరూ వ్యభిచార అపరాధులే. అందుచేత మగవాడు, ఆడది ఇద్దరూ చంపబడాల్సిందే.

11 ఒక మగవాడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాణ్ణి చంపివేయాలి. ఆ మగవాణ్ణి, అతని తండ్రి భార్యను, ఇద్దర్నీ చంపివేయాలి. వాడు తన తండ్రికి విరుద్ధంగా పాపం చేసాడు.

12 “ఒక మగవాడు తన కోడలితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వాళ్ళిద్దర్నీ చంపివేయాలి. వాళ్లు చాలా దారుణమైన లైంగిక పాపం చేసారు. వాళ్లు శిక్షించబడాల్సిందే.

13 “ఒక మగవాడు ఒక స్త్రీతో కలిగి ఉన్నట్టుగా మరో మగవాడితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వీళ్ళిద్దరు మగవాళ్లూ చాలా దారుణ పాపం చేసినట్టే. వాళ్ళను చంపివేయాల్సిందే. వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.

14 “ఒక మగవాడు ఒక స్త్రీతో, ఆమె తల్లితో కూడా లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అది లైంగిక పాపం. ఆ మగవాడ్ని, ఆడవాళ్లు ఇద్దర్నీ ప్రజలు కాల్చి వేయాలి. మీ ప్రజల మధ్య ఇలాంటి లైంగిక పరమైన పాపం జరగనివ్వకండి.

15 “ఒక మగావాడు ఒక జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అతణ్ణి చంపివేయాల్సిందే. మరియు మీరు ఆ జంతువును గూడ చంపివేయాలి.

16 ఒక స్త్రీ గనుక ఒక జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకొంటే, ఆ స్త్రీని, జంతువును కూడ మీరు చంపివేయాలి. వారిని చంపేయాలి, వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.

17 “ఒక సోదరుడు అతని సోదరి అనగా తండ్రి కుమార్తెగాని, తల్లి కుమార్తెగాని ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకోవటం చాలా సిగ్గుచేటు. వాళ్లను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ల ప్రజల్లోనుంచి వాళ్లను వేరు చేయాలి. తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మగవాడు అతని పాపం నిమిత్తం శిక్షపొందాలి.

18 “ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక మగవాడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దర్నీ వాళ్ల ప్రజల్లోనుంచి వేరు చేయాలి. ఆమె రక్తస్రావ స్థానాన్ని వారు బహిర్గతం చేసారు గనుక వాళ్లు పాపం చేసారు.

19 “మీ తల్లి సోదరితో గాని, తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధాలు పెట్టుకో గూడదు. అది రక్తసంబంధికుల పాపం. వాళ్ల పాపం మూలంగా వాళ్లు శిక్ష పొందాలి.

20 “ఒకడు తన పినతల్లితో శయనించగూడదు. అతడు, అతని పినతల్లికూడ వారు చేసిన పాపం మూలంగా శిక్ష పొందుతారు. వాళ్లు పిల్లలు లేకుండా చస్తారు.

21 “ఎవడైనా తన సోదరుని భార్యను చేర్చుకోవడం తప్పు. వాడు తన సోదరునికి విరోధంగా పాపం చేసాడు. వాళ్లకూ పిల్లలు ఉండరు.

22 “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను మిమ్మల్ని మీ దేశానికి నడిపిస్తున్నాను. ఆ దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులైతే ఆ దేశం మిమ్మల్ని వెళ్లగొట్టదు.

23 ఇతర ప్రజల్ని ఆ దేశంలో నుండి నేను వెళ్ల గొట్టేస్తున్నాను. ఎందుచేతనంటే వాళ్లు అలాంటి పాపాలన్నీ చేసారు. ఆ పాపాలంటే నాకు అసహ్యం. కనుక వాళ్లు జీవించినట్టు మీరు జీవించకండి.

24 వాళ్ల దేశం మీది అవుతుంది. అని నేను మీతో చెప్పాను. వాళ్ల దేశాన్ని నేను మీకు యిస్తాను. అది మీ దేశం అవుతుంది. ఆ దేశం చాలా మంచి దేశం. పాలు, తేనెలు ప్రవహించే దేశం అది. నేను మీ దేవుడైన యెహోవాను. “నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను. ఇతరులకంటే మిమ్మల్ని నేను వేరుగా చూసుకొన్నాను.

25 కనుక పవిత్ర జంతువుల్ని అపవిత్ర జంతువులకంటె వేరుగా మీరు చూసుకోవాలి. పవిత్ర పక్షుల్ని అపవిత్ర పక్షుల కంటే వేరుగా మీరు చూసుకోవాలి. అపవిత్ర పక్షులు, జంతువులు, నేలమీద ప్రాకే వాటిలో దేన్నీ మీరు తినవద్దు. నేను వాటిని అపవిత్రంగా చేసాను.

26 నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసాను. అందుచేత మీరు నా కోసం పవిత్రంగా ఉండాలి. ఎందుచేతనంటే నేను యెహోవాను, నేను పవిత్రుణ్ణి.

27 “కర్ణపిశాచి, సోదెచెప్పేవారు, మగవాడు గాని, స్త్రీగాని చంపబడాల్సిందే. రాళ్లతో ప్రజలు వారిని చంపివేయాలి. వాళ్లు శిక్షించబడాలి.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan