లేవీయకాండము 2 - పవిత్ర బైబిల్ధాన్యార్పణలు 1 “ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ పెట్టేటప్పుడు అది శ్రేష్ఠమైన పిండిగా ఉండాలి. ఆ వ్యక్తి ఆ పిండిమీద నూనెపోసి, సాంబ్రాణి వేయాలి. 2 అప్పుడు దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు అతడు తీసుకొని రావాలి. సాంబ్రాణిని, నూనె కలిపిన పిండిలో ఒక గుప్పెడు ఆ వ్యక్తి తీసుకోవాలి. అప్పుడు యాజకుడు బలిపీఠపు అగ్నితో ఆ పిండిని జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. 3 మిగిలిపోయిన ధాన్యార్పణ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములు అన్నింటిలో ఇది అతి పవిత్రం. కాల్చిన ధాన్యార్పణలు 4 “పొయ్యిమీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు పెట్టేటప్పుడు అది నూనె కలిపిన శ్రేష్ఠమైన పిండితో చేయబడ్డ పొంగని రొట్టెలు, లేక నూనె రాయబడ్డ పొంగని అప్పడాలు కావాలి. 5 పెనం మీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి పిండి కావాలి. 6 దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ. 7 నీవు వంట గిన్నెలో వండిన ధాన్యార్పణ తెస్తే అది నూనెతో కలుపబడిన మంచి పిండికావాలి. 8 “ఈ పదార్థాలతో చేయబడిన ధాన్యార్పణను నీవు యెహోవాకు తీసుకొని రావాలి. నీవు వాటిని యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లాలి, అతడు వాటిని బలిపీఠం మీద ఉంచుతాడు. 9 ఇది జ్ఞాపకార్థమైన అర్పణ. అది బలిపీఠం మీద దహించబడాలి. అగ్నిమీద అది దహించ బడుతుంది. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. 10 మిగిలిపోయిన ధాన్యార్పణలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమాలలో ఇది అతి పవిత్రం. 11 “పులిసిన పదార్థం ఉన్న ధాన్యార్పణ ఏదీ మీరు యెహోవాకు తీసుకొని రాకూడదు. పులిసిన పదార్థంగాని, తేనెగాని యెహోవాకు అర్పణగా అగ్నిమీద దహించకూడదు. 12 మొదటి పంటలో నుండి పులిసిన పదార్థాన్ని, తేనెను యెహోవాకు అర్పణగా మీరు తీసుకొని రావచ్చును. కానీ బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగా ఉండేందుకు పులిసిన పదార్థం, తేనె దహించబడకూడదు. 13 నీవు తీసుకొని వచ్చే ప్రతి ధాన్యార్పణలో ఉప్పు తప్పక వేయాలి. నీవు అర్పించు ధాన్యార్పణలో ఉప్పు వేయవలెను. మొదటి పంటనుండి ధాన్యార్పణలు 14 “మొదటి పంటలో నుండి నీవు యెహోవాకు ధాన్యార్పణ అర్పిస్తే, వాటిని పేల్చి తీసుకురావాలి. కొత్త ధాన్యం నుండి వాటిని ఒలిచి తీసుకొని రావాలి. ఇది మొదటి పంటలోనుండి నీ కొరకైన ధాన్యార్పణ అవుతుంది. 15 దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది. 16 ఒలిచిన ధాన్యాన్ని, నూనెలోనుండి కొంతభాగాన్ని, సాంబ్రాణి మొత్తాన్ని జ్ఞాపకార్థ అర్పణగా యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు హోమమైయుండును. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International