Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 3 - పవిత్ర బైబిల్


యొర్దాను నదిలో అద్భుత కార్యం

1 మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి, షిత్తీము విడిచి పెట్టారు. యొర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యొర్దాను నది దగ్గర గుడారాలు వేసారు.

2 మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు.

3 నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను యాజకులు, లేవీయులు మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి.

4 కాని, మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1,000 గజాలు వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు.

5 అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు.

6 తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసుకొనిపోయారు.

7 అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు.

8 యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యొర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి.’”

9 అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి.

10 జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు.

11 ఇదే ఋజువు. మీరు యొర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది.

12 ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి.

13 సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యొర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యొర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్ట వేసినట్టు నిలిచిపోతాయి.”

14 యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యొర్దాను నది దాటడం ప్రారంభించారు.

15 (కోతకాలంలో యొర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు.

16 సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు.

17 ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యొర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan