Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 14 - పవిత్ర బైబిల్

1 యాజకుడైన ఎలియాజరు, నూను కూమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు వంశాలు అన్నింటీ నాయకులు కలిసి ప్రజలకు ఏ భూమి ఇవ్వాలి అనే విషయం నిర్ణయం చేసారు.

2 ప్రజలు ఏ విధంగా వారి భూమిని నిర్ణయించుకోవాల్సిందీ చాలకాలం క్రితమే మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు. తొమ్మిదిన్నర వంశాల వారు ఎవరికి ఏ భూమి అనే విషయం నిర్ణయించేందుకు చీట్లు వేసారు.

3 రెండున్నర వంశాల వారికి యొర్దాను నదికి తూర్పున వారి భూమి వారికి మోషే ఇదివరకే ఇచ్చాడు. అయితే మిగతా ప్రజల్లా లేవీ వంశానికి మాత్రం భూమి ఏమీ ఇవ్వబడలేడు.

4 (పన్నెండు వంశాలకు వారి స్వంత భూమి ఇవ్వబడింది) యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము రెండు వంశాలుగా విభజించబడ్డారు. (మరియు ఒక్కో వంశానికి కొంత భూమి దొరికింది) కానీ లేవీ వంశపు ప్రజలకు భూమి ఏమీ ఇవ్వబడలేదు. వారు నివసించేందుకు కొన్ని పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి. (ఈ పట్టణాలు ప్రతి వంశంవారి భూమిలోనూ ఉన్నాయి.) వారి జంతువులకోసం వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.

5 ఇశ్రాయేలు వంశాలకు భూమిని ఇచ్చే విధానం మోషేకు యెహోవా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఆజ్ఞాపించినట్టే భూమిని పంచుకొన్నారు.


కాలేబు తన భూమిని పొందటం

6 ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీవాడైన యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు మోషేతో మాట్లాడుతూ నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు.

7 మనం వెళ్లబోతున్న దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను.

8 అయితే నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయాలను వారితో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని యెహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా నమ్మాను.

9 కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేసాడు: ‘నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించావు గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.’

10 “ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు.

11 మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను.

12 కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇవ్వు. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.”

13 యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు.

14 ఇప్పటికీ ఆ హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి అతడు నమ్ముకొని విధేయుడైనందువల్ల ఇప్పటికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది.

15 గతంలో ఆ పట్టణం కిర్యత్ అర్బ అని పిలువబడింది. అనాకీ ప్రజల్లోకెల్లా మహా గొప్పవాడైన అర్బ పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan