Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోనా 4 - పవిత్ర బైబిల్


దేవుని కరుణ యోనాకు కోపకారణమవటం

1 దేవుడు నగరాన్ని రక్షించటంపట్ల యోనా సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది.

2 యోనా యెహోవాపట్ల చిరాకుతో ఇలా అన్నాడు: “ఇది జరుగుతుందని నాకు తెలుసు! నేను నా దేశంలో ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఈ దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు అప్పుడే తెలుసు. అందువల్లనే నేను తర్షీషుకు పారిపోవటానికి నిర్ణయించుకున్నాను. నీవు దయగల దేవుడవని నాకు తెలుసు! నీవు కరుణ చూపిస్తావనీ, నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! నీ అంతరంగం కరుణతో నిండివుందనీ నాకు తెలుసు! వీరు పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు.

3 కావున యెహోవా, నన్ను చంపివేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను బ్రతకటం కంటే చనిపోవటం మంచిది!”

4 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ఆ ప్రజలను నాశనం చెయ్యనంత మాత్రాన నీవు కోపగించుకోవటం నీకు సమంజసమని అనుకుంటున్నావా?”

5 అయినా యోనా జరిగినదానికంతకు ఇంకా కోపంగానే ఉన్నాడు. కావున అతడు నగరం వెలుపలికి వెళ్లాడు. తూర్పు దిక్కున నగరానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి యోనా వెళ్లాడు. యోనా తన కొరకు ఒక పందిరి నిర్మించుకున్నాడు. నగరానికి ఏమవుతుందో చూద్దామని ఎదురుచూస్తూ అతడు ఆ నీడలో కూర్చున్నాడు.


సొరచెట్టు-పురుగు

6 యోనా కూర్చునివున్న పందిరి మీదికి ఒక సొరపాదును త్వరత్వరగా పాకేలా యెహోవా చేశాడు. అది యోనా కూర్చోవటానికి చల్లని వాతావరణం కల్పించింది. ఇది యోనాకు హాయిని సమకూర్చటంలో సహాయ పడింది. ఈ సొరపాదు మూలంగా యోనా చాలా సంతోషంగా ఉన్నాడు.

7 మరునాటి ఉదయం, మొక్కలో ఒక భాగాన్ని తినివేయటానికి ఒక పురుగును దేవుడు పంపాడు. ఆ పురుగు మొక్కను తినివేయటం మొదలుపెట్టగా, ఆ మొక్క చనిపోయింది.

8 మిట్టమధ్యాహ్నమయ్యే సరికి, దేవుడు తూర్పునుండి వేడిగాడ్పులు వీచేలా చేశాడు. యోనా తలమీద సూర్యుని వేడిమి ఎక్కువయ్యింది. యోనా బాగా నీరసించిపోయాడు. యోనా దేవునితో తనను చనిపోనిమ్మన్నాడు. “నేను బ్రతకటంకంటే చనిపోవటం మేలు” అని యోనా అన్నాడు.

9 కాని దేవుడు యోనాతో, “ఈ మొక్క చనిపోయినంత మాత్రాన నీవు కోపగించుకోవటం సమంజసమేనా?” అని అన్నాడు. “అవును, నేను కోపగించుకోవటం సమంజసమే! నేను చచ్చిపోవాలనేటంత కోపంతో ఉన్నాను” అని యోనా అన్నాడు.

10 పిమ్మట యెహోవా ఇలా అన్నాడు: “ఆ మొక్కకు నీవు ఏమీ చేయలేదు! నీవు దానిని పెంచలేదు. అది రాత్రికి రాత్రి పెరిగి, మరునాడు చనిపోయింది. ఇప్పుడు నీవు ఆ మొక్కను గురించి విచారిస్తున్నావు.

11 నీవు ఒక మొక్కను గురించే కలత చెందినప్పుడు, నేను నీనెవెలాంటి ఒక మహా నగరంగురించి ఖచ్చితంగా విచారిస్తాను. ఆ నగరంలో ప్రజలు ఉన్నారు. జంతువులు అనేకంగా ఉన్నాయి. తాము తప్పు చేస్తున్నామని తెలియని ఒక లక్షా ఇరవై వేల మందికంటే ఎక్కువమంది ప్రజలు ఆ నగరంలో ఉన్నారు.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan