Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోవేలు 3 - పవిత్ర బైబిల్


యూదా శత్రువులు శిక్షింపబడుదురు

1 “ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదాను, యెరూషలేమును నేను తిరిగి తీసుకొని వస్తాను.

2 రాజ్యాలన్నింటిని కూడా నేను సమావేశ పరుస్తాను. ఈ రాజ్యాలన్నింటిని క్రిందికి యెహోషాపాతు లోయలోకి నేను తీసుకొని వస్తాను. అక్కడ వారికి నేను తీర్పు చెప్తాను. ఆ రాజ్యాలు నా ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టాయి. వారు ఇతర రాజ్యాలలో జీవించేలా వారు వారిని బలవంత పెట్టారు. కనుక ఆ రాజ్యాలను శిక్షిస్తాను. ఆ రాజ్యాలు నా దేశాన్ని విభజింపచేశాయి.

3 నా ప్రజల కోసం వారు చీట్లు వేసుకొన్నారు. ఒక వేశ్యను కొనేందుకు వారు ఒక బాలుని అమ్ముకొన్నారు. మరియు తాగడానికి ద్రాక్షామద్యం కొనేందుకు వారు ఒక బాలికను అమ్ముకొన్నారు.

4 “తూరూ! సీదోనూ! ఫిలిష్తీయలోని అన్నిప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదైనా చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను మిమ్ముల్ని శిక్షిస్తాను.

5 నా వెండి, బంగారం మీరు తీసుకొన్నారు. నా ప్రశస్త ఐశ్వర్యాలు మీరు తీసుకొని మీమీ ఆలయాల్లో పెట్టుకొన్నారు.

6 “యూదా, యెరూషలేము ప్రజలను మీరు గ్రీకువాళ్ళకు అమ్మేశారు. ఆ విధంగా మీరు వారిని దేశానికి దూరంగా తీసికొని వెళ్ళగలిగారు.

7 మీరు నా ప్రజలను అంత దూరస్థలానికి పంపించి వేశారు. కానీ నేను వారిని వెనుకకు తీసికొని వస్తాను. మరియు మీరు చేసినదానికి నేను మిమ్ముల్ని శిక్షిస్తాను.

8 మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము ప్రజలకు అమ్మివేస్తారు.” ఆ విషయాలు యెహోవా చెప్పాడు.


యుద్ధానికి సిద్ధపడండి

9 రాజ్యాలలో దీనిని ప్రకటించండి: యుద్ధానికి సిద్ధపడండి! బలాఢ్యులను మేల్కొలపండి! యుద్ధ వీరులందరినీ దగ్గరగా రానివ్వండి, వారిని రానివ్వండి!

10 మీ నాగటి కర్రులను చెడగొట్టి కత్తులు చేయండి. మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. బలహీనుడ్ని కూడ “నేను బలాఢ్యుడను” అని చెప్పనీయండి.

11 సకల రాజ్యాల్లారా, త్వరపడండి! ఆ స్థలానికి కూడి రండి! యెహోవా, బలమైన నీ సైనికులను తీసికొని రా.

12 రాజ్యాల్లారా, మేల్కొనండి. యెహోషాపాతు లోయలోనికి రండి. చుట్టుపక్కల రాజ్యాలన్నింటికీ తీర్పు చెప్పేందుకు అక్కడ నేను కూర్చుంటాను.

13 పంట సిద్ధంగా ఉంది గనుక కొడవలి పట్టుకొని రండి. రండి, ద్రాక్షా గానుగ నిండిపోయింది గనుక ద్రాక్షాపండ్లమీద నడవండి. వారి దుర్మార్గం చాలాఉంది గనుక పీపాలు నిండిపోయి పొర్లిపోతాయి.

14 తీర్మాన లోయలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. యెహోవా ప్రత్యేక దినం తీర్మాన లోయకు సమీపంగా ఉంది.

15 సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. నక్షత్రాలు ప్రకాశించడం మానివేస్తాయి.

16 యెహోవా దేవుడు సీయోనులోనుండి కేకవేస్తాడు. యెరూషలేమునుండి ఆయన కేక వేస్తాడు. మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి. కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్థానం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు.

17 “మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు. నా పవిత్ర పర్వతమైన సీయోనులో నేను నివసిస్తాను. యెరూషలేము పవిత్రం అవుతుంది. పరాయివారు ఆ పట్టణంలోనుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.”


యూదాకు కొత్తజీవితం వాగ్దానం చేయబడుట

18 “ఆ రోజున పర్వతాలనుండి తియ్యటి ద్రాక్షారసం కారుతుంది. కొండల్లో పాలు, తేనెలు ప్రవహిస్తాయి. మరియు యూదాలోని ఖాళీ నదులన్నిటిలో నీళ్ళు ప్రవహిస్తాయి. యెహోవా ఆలయంలోనుండి ఒక నీటి ఊట చిమ్ముతుంది. అది షిత్తీము లోయకు నీళ్ళు ఇస్తుంది.

19 ఈజిఫ్టు ఖాళీ అవుతుంది. ఎదోము ఖాళీ అరణ్యం అవుతుంది. ఎందుకంటే యూదా ప్రజలపట్ల వారు క్రూరంగా ఉన్నారు. వారి దేశంలోని నిర్దోషప్రజలను వారు చంపివేశారు.

20 కాని యూదాలో మనుష్యులు ఎల్లప్పుడూ నివసిస్తారు. అనేక తరాలవరకు యెరూషలేములో మనుష్యులు నివసిస్తారు.

21 ఆ మనుష్యులు చాలా మంది ప్రజలను చంపేశారు. కనుక ఆ ప్రజలను నేను నిజంగా శిక్షిస్తాను!” యెహోవా దేవుడు సీయోనులో నివసిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan