యోవేలు 1 - పవిత్ర బైబిల్మిడుతలు పంటలను పాడుచేయుట 1 పెతూయేలు కుమారుడైన యోవేలు ఈ సందేశాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు: 2 నాయకులారా, ఈ సందేశం వినండి! దేశంలో నివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి. మీ జీవితకాలంలో ఇలాంటిది ఏదైనా ఇదివరకు జరిగిందా? లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఏదైనా జరిగిందా? లేదు! 3 ఈ సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో చెపుతారు. మీపిల్లలు వారి పిల్లలతో చెపుతారు. మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత తరమువారితో చెపుతారు. 4 కోత మిడుతలు విడిచిపెట్టినదానిని దండు మిడుతలు తినేస్తాయి దండు మిడుతలు విడిచిపెట్టినదానిని దూకుడు మిడుతలు తినేస్తాయి. దూకుడు మిడుతలు విడిచిపెట్టినదానిని వినాశ మిడుతలు తినేశాయి! మిడుతలు — పెద్ద దండు 5 మద్యపాన మత్తులారా, మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే, మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపోయింది. ఆ ద్రాక్షామద్యం మరో గుక్కెడు మీకు దొరకదు. 6 నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒక పెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ శక్యం కానంతమంది సైనికులు ఉన్నారు. ఆ మిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు! అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంటుంది. 7 నా ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ ఆ “మిడుతలు” తినేస్తాయి! అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి. మిడుతలు నా చెట్ల బెరడును తినేస్తాయి. కొమ్మలు తెల్లబారి పోతాయి. చెట్లు నాశనం చేయబడతాయి. ప్రజలు దుఃఖించుట 8 పెళ్లికి సిద్ధంగా ఉండి, తనకు కాబోయే భర్త అప్పుడే చంపి వేయబడగా, ఒక యువతి ఏడ్చేలా ఏడ్వండి. 9 యాజకులారా! యెహోవా సేవకులారా! ఏడ్వండి. ఎందుకంటే యెహోవా ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు. 10 పొలాలు పాడుచేయబడ్డాయి. చివరికి నేలకూడా విలపిస్తుంది. ఎందుకనగా ధాన్యం పాడైపోయింది. కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది. ఒలీవ నూనె ఇకలేదు. 11 రైతులారా! విచారించండి. ద్రాక్షాతోట రైతులారా! గట్టిగా ఏడ్వండి. గోధుమ, యవల కోసం ఏడ్వండి! ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది. 12 ద్రాక్షావల్లులు ఎండిపోయాయి. అంజూరపుచెట్టు చస్తోంది. దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు, జల్దరు చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండిపోయాయి. ప్రజల్లో సంతోషం చచ్చింది. 13 యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి. బలిపీఠపు సేవకులారా, గట్టిగా ఏడ్వండి. నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు. ఎందుకంటే, దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు. మిడుతల భయంకర నాశనం 14 ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసం ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయానికి వారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి. 15 దుఃఖపడండి! ఎందుకంటే, యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరనుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది. 16 మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయంనుండి ఆనందం, సంతోషం పోయాయి. 17 మనం విత్తనాలు విత్తాం, కాని ఆ విత్తనాలు ఎండిపోయి, చచ్చి, మట్టిలో పడివున్నాయి. మన మొక్కలు ఎండిపోయి, చచ్చిపోయాయి. మన కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి. 18 జంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. అవి మేసేందుకు గడ్డి లేదు. గొఱ్ఱెలు చస్తున్నాయి. 19 యెహోవా, సహాయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలోని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చివేశాయి. 20 అడవి జంతువులకు కూడ నీ సహాయం కావాలి. కాలువలు ఎండిపోయాయి. నీళ్ళు లేవు. మా పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International