Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 2 - పవిత్ర బైబిల్


సాతాను యోబును మరల శ్రమ పెట్టటం

1 మరో రోజు దేవదూతలు యెహోవాను కలుసు కొనేందుకు వచ్చారు. సాతాను వారితో కూడా ఉన్నాడు. సాతాను యెహోవాను కలుసుకొనేందుకు వచ్చాడు.

2 “ఎక్కడికి వెళ్లావు?” అని సాతానును యెహోవా అడిగాడు. “నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని సాతాను యెహోవాకు జవాబు ఇచ్చాడు.

3 “నా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? భూమి మీద ఎవ్వరూ అతని వంటివారు లేరు. నిజంగా అతడు మంచి మనిషి. అతడు తన దేవుడనైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు” అని సాతానుతో యెహోవా అన్నాడు.

4 “చర్మానికి చర్మం బ్రతికి ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు.

5 అతని శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే, అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు!” అని సాతాను జవాబు ఇచ్చాడు.

6 “సరే, యోబు నీ అధికారం క్రింద ఉన్నాడు. కాని అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు” అని సాతానుతో యెహోవా చెప్పాడు.

7 అప్పుడు సాతాను యెహోవా దగ్గర నుండి వెళ్లిపోయి, యోబుకు బాధకరమైన పుండ్లు కలిగించాడు. యోబు అరికాలు మొదలుకొని నడినెత్తివరకు, అతని శరీరం అంతటా బాధకరమైన పుండ్లు ఉన్నాయి.

8 కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు. అతడు తన పుండ్లను గీకుకొనేందుకు ఒక చిల్లపెంకు ఉపయోగించాడు.

9 యోబు భార్య, “ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? నీ వెందుకు దేవుణ్ణి శపించి, చావకూడదు?” అని అతనితో అంది.

10 యోబు తన భార్యతో, “నీవు తెలివి తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు! దేవుడు మనకు మంచి వాటిని ఇచ్చినప్పుడు, మనం వాటిని స్వీకరిస్తున్నాం. కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి గాని ఆరోపణ చేయకూడదు” అని జవాబిచ్చాడు. ఇవన్ని జరిగినప్పటికీ కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి విరుద్ధంగా ఏమియు మాట్లాడనూలేదు.


ముగ్గురు స్నేహితులు యోబును చూడటానికి వచ్చారు

11 తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైన బిల్దదు, నయమాతీవాడైన జోఫరు అనే ముగ్గురు యోబుకు స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతులు అన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట సమావేశమయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు.

12 కాని ఆ స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకొన్నారు.

13 తరువాత ఆ ముగ్గురు స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan