Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 43 - పవిత్ర బైబిల్

1 వారి దేవుడైన యెహోవావద్ద నుండి వచ్చిన సందేశాన్ని యిర్మీయా అలా చెప్పి ముగించాడు. యెహోవా తనకు తెలియజేసిన రీతిగా యిర్మీయా ప్రజలందరికి పూర్తిగా చెప్పాడు.

2 కాని హోషేయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకను మరికొంత మంది అహంభావంతో మొండివైఖరి దాల్చారు. వారు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. “యిర్మీయా నీవు అబద్ధమాడుతున్నావు! ‘ఓ ప్రజలారా, మీరు నివసించటానికి ఈజిప్టుకు వెళ్లరాదు’ అని మాకు చెప్పుమని మా ప్రభువైన దేవుడు నిన్ను పంపలేదు.

3 యిర్మీయా, నేరియా కుమారుడైన బారూకు నిన్ను మాకు వ్యతిరేకంగా పురికొల్పుచున్నాడని మేమనుకుంటున్నాము. నీవు మమ్మల్ని బబులోను వారికి అప్పగించాలని అతడు ఆశిస్తున్నాడు. నీవు ఇది చేస్తే, వారు మమ్మల్ని చంపాలని ఎదురు చూస్తున్నారు. లేదా, నీవిది చేస్తే వారు మమ్మల్ని బందీలుగా బబులోనుకు పట్టుకుపోవాలని కోరుకొని వుండవచ్చు” అని అన్నారు.

4 కావున యోహానాను, సైనికాధికారులు, ఇతర ప్రజలు ప్రభువాజ్ఞ తిరస్కరించారు. యెహోవా వారిని యూదాలో వుండమని ఆజ్ఞ ఇచ్చాడు.

5 కాని ప్రభువాజ్ఞ పాటించటానికి బదులు, యోహానాను మరియు సైనికాధికారులు యూదాలో మిగిలిన వారిని ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. గతంలో ఆ మిగిలిన వారిని శత్రువు ఇతర దేశాలకు తీసికొని వెళ్లాడు. కాని వారు మరల యూదా దేశానికి తిరిగి వచ్చారు.

6 ఇప్పుడు యోహానాను మరియు సైనికాధికారులు కలిసి పురుషులను, స్త్రీలను, పిల్లలను అందరినీ ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. ఆ విధంగా తీసికొని వెళ్లబడిన వారిలో రాజు కుమార్తెలు కూడ వున్నారు. (నెబూజరదాను ఆ ప్రజలందరినీ గెదల్యా సంరక్షణలో వుంచాడు. నెబూజరదాను బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతి.) ప్రవక్తయైన యిర్మీయాను, నేరీయా కుమారుడగు బారూకును కూడ యోహానాను వెంట తీసికొని వెళ్లాడు.

7 వారు యెహోవా మాట పెడచెవినిబెట్టి ఈజిప్టుకు వెళ్లారు. వారు తహపనేసు అనే పట్టణానికి వెళ్లారు.

8 తహపనేసు పట్టణంలో యెహోవా యొక్క ఈ వర్తమానం యిర్మీయాకు చేరింది:

9 “యిర్మీయా, కొన్ని పెద్ద రాళ్లను తీసికొనిరా, వాటిని తహపనేసులో ఫరో రాజు అధికార గృహానికి ఎదురుగా మట్టితోను, ఇటుకలతోను నిర్మించిన ప్రక్కబాట క్రింద పాతిపెట్టు. యూదా వారు చూస్తుండగా నీవీపని చేయ్యి.

10 అప్పుడు నిన్ను చూస్తూవున్న యూదా వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: బబులోను రాజైన నెబుకద్నెజరును ఇక్కడికి పిలుస్తాను. అతడు నా సేవకుడు. నేనిక్కడ పాతిపెట్టిన రాళ్లమీద నేనతని సింహాసనాన్ని నెలకొల్పుతాను. నెబుకద్నెజరు తన రత్నకంబళిని ఈ రాళ్లపై పరుస్తాడు.

11 నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చిన ఈజిప్టును ఎదిరిస్తాడు. మరణించవలసిన వారికి అతడు మరణాన్ని తీసికొనివస్తాడు. బందీలుగా కొనిపోబడే వారికి దాస్యాన్ని తెస్తాడు. కత్తిచే హతము గావింపబడే వారి మీదికి ఖడ్గాన్ని తెస్తాడు

12 ఈజిప్టులోని బూటకపు దేవుళ్ల గుళ్లల్లో నెబుకద్నెజరు అగ్నిని రగుల్చుతాడు. అతడా గుళ్లను తగులబెట్టి, విగ్రహాలను తీసికొని పోతాడు. గొర్రెల కాపరి తమ బట్టలనుండి నల్లులను, ముండ్ల కాయలను ఏరివేయునట్లు నెబుకద్నెజరు ఈజిప్టును శుభ్రపర్చి వశం చేసికొంటాడు. ఆ తరువాత అతడు ఈజిప్టునుండి సురక్షితంగా వెళ్లిపోతాడు.

13 ఈజిప్టులో అతి ముఖ్యమైన సూర్య దేవాలయంలోని పవిత్ర రాతి స్తంభాలను నెబుకద్నెజరు నాశనం చేస్తాడు. పైగా ఈజిప్టులోని బూటకపు దేవతల ఆలయాలన్నిటినీ అతడు తగులబెడతాడు!’”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan