Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 39 - పవిత్ర బైబిల్


యెరూషలేము పతనం

1 యెరూషలేము ఈ విధంగా లోబరచుకోబడింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము మీదికి తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు నగరాన్ని ముట్టడించాడు.

2 సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) పగులగొట్టబడింది.

3 దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

4 యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు.

5 కాని కల్దీయుల సైన్యం సిద్కియాను, అతనితో ఉన్న సైనికులను తరుముకుంటూ పోయారు. కల్దీయుల సైన్యం సిద్కియాను యెరికో మైదానాలలో పట్టుకున్నారు. వారు సిద్కియాను పట్టుకుని బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన తీర్పును ఇచ్చాడు.

6 రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు.

7 తరువాత సిద్కియా కండ్లను నెబుకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.

8 బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము వాసుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మరియు వారు యెరూషలేము గోడలను పడగొట్టారు.

9 నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు.

10 కాని ప్రత్యేక అంగరక్షకుల దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తి పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజరదాను యూదాలోని పేద ప్రజలకు ద్రాక్షాతోటలను, పొలాలను ఇచ్చాడు.

11 కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు.

12 “యిర్మీయాను వెదకి తెలిసికొని అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయపర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ ఇచ్చాడు.

13 ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదాను, బబులోను సైన్యంలో ముఖ్యాధికారియైన నెబూషజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్షరేజరు మరియు ఇతర బబులోను సైన్యాధికారులు యిర్మీయాను పిలిపించారు.

14 యూదా రాజు రక్షకుల ఆధీనంలో ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను సైన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు అప్పగించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీయాను తిరిగి ఇంటికి తీసికొని పోవటానికి గెదల్యాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల్ల యిర్మీయా తన ఇంటికి తీసికొనిపోబడగా అతడు తన ప్రజలతో కలిసి నివసించాడు.


ఎబెద్మెలెకునకు యెహోవా వర్తమానం

15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది:

16 “యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబెద్మెలెకునకు అందజేయుము: ‘ఇతశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయిగాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు.

17 కాని ఎబెద్మెలెకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను.’ ఇది యెహోవా సందేశం. ‘నీవు ఎవరిని చూచి భయబడుతున్నావో వారికి నిన్ను అప్పగించను.

18 ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను నమ్మావు. గనుక అలా జరుగుతుంది.’” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan