న్యాయాధి 10 - పవిత్ర బైబిల్న్యాయముర్తి తోలా 1 అబీమెలెకు చనిపోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు దేవుడు మరో న్యాయమూర్తిని పంపించాడు. ఆ మనిషి పేరు తోలా. తోలా, పువ్వా అనే పేరుగల మనిషి కుమారుడు. పువ్వా, దోదో అనే పేరుగల వాని కుమారుడు. తోలా ఇశ్శాఖారు వంశానికి చెందినవాడు. తోలా షామీరు పట్టణంలో నివసించేవాడు. షామీరు పట్టణం ఎఫ్రాయిము కొండ దేశంలో ఉంది. 2 తోలా ఇరవైమూడు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. తర్వాత తోలా చనిపోయి, షామీరు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు. న్యాయమూర్తి యాయీరు 3 తోలా మరణించిన తరువాత మరో న్యాయమూర్తి దేవుని చేత పంపబడ్డాడు. ఆ మనిషి పేరు యాయీరు. యాయీరు గిలాదు ప్రాంతంలో నివసించేవాడు. యాయీరు ఇరవైరెండు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. 4 యాయీరుకు ముప్పయి మంది కుమారులు. ఆ ముప్పయి మంది కుమారులు ముప్పయి గాడిదల మీద తిరిగేవారు. వారు గిలాదు ప్రాంతంలోని ముప్పయి పట్టణాల మీద అధికారం చేసేవారు. ఈ రోజు వరకు ఆ పట్టణాలు యాయీరు పట్టణాలు అని పిలువబడుతున్నాయి. 5 యాయీరు మరణించి కామోను పట్టణంలో పాతిపెట్టబడ్డాడు. అమ్మోనీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయుట 6 మరల ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా చెడ్డవి అని చెప్పిన వాటినే చేసారు. బూటకపు దేవతలు బయలు, అష్టారోతులను వారు పూజించటం మొదలు పెట్టారు. వారు అరాము ప్రజల దేవుళ్లను, సీదోను ప్రజల దేవుళ్లను, మోయాబు ప్రజల దేవుళ్లను, అమ్మోను ప్రజల దేవుళ్లను, ఫిలిష్తీయ ప్రజల దేవుళ్లను కూడా పూజించారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను విడిచిపెట్టి ఆయనను సేవించటం మానుకున్నారు. 7 కనుక ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు కోపం వచ్చింది. ఫిలిష్తీ ప్రజలు, అమ్మోను ప్రజలు వారిని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. 8 అదే సంవత్సరం యోర్దాను నదికి తూర్పు వైపునగల గిలాదు ప్రాంతంలో నివసించే ఇశ్రాయేలు ప్రజలను ఆ మనుష్యులు నాశనం చేసారు. అది అమ్మోరీ ప్రజలు నివసించిన దేశం. ఆ ఇశ్రాయేలు ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలు శ్రమ అనుభవించారు. 9 అప్పుడు అమ్మోనీయులు యోర్దాను నది దాటి వెళ్లారు. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము ప్రజల మీద యుద్ధం చేసేందుకు వారు వెళ్లారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలకు అనేక కష్టాలు కలిగించారు. 10 కనుక ఇశ్రాయేలు ప్రజలు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. “దేవా, మేము నీకు విరోధంగా పాపం చేశాము. మేము మా దేవుని విడిచిపెట్టి బూటకపు బయలు దేవతను పూజించాము” అని వారు చెప్పారు. 11 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా జవాబు చెప్పాడు: “ఈజిప్టు ప్రజలు అమ్మోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. వారి బారినుండి నేను మిమ్మల్ని రక్షించాను. 12 సీదోను ప్రజలు, అమాలేకీయులు, మిద్యానీయులు మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. ఆ ప్రజల నుండి కూడా నేను మిమ్మల్ని రక్షించాను. 13 కానీ మీరు నన్ను విడిచిపెట్టేశారు. మీరు ఇతర దేవుళ్లను పూజించారు. కనుక మిమ్మల్ని మరల రక్షించటానికి నేను నిరాకరిస్తున్నాను. 14 ఆ దేవుళ్లను పూజించటం మీకు ఇష్టం కనుక వెళ్లి, సహాయం కోసం వాటికి మొరపెట్టండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుళ్లనే మీకు సహాయం చేయనీయండి.” 15 కానీ ఇశ్రాయేలు ప్రజలు, “మేము పాపం చేశాము. మమ్మల్ని నీవు ఏమి చేయాలనుకొంటే అలాగే చేయి. కానీ ఈ వేళ నీవు మమ్మల్ని రక్షించు” అని యెహోవాను అడిగారు. 16 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ అన్యదేవతలను పారవేశారు. వారు మరల యెహోవాను ఆరాధించటం మొదలు పెట్టారు. కనుక వారు శ్రమపడుతున్నప్పుడు యెహోవా వారిని చూచి సంతాపపడ్డాడు. నాయకునిగా యెఫ్తా ఎన్నుకోబడుట 17 అమ్మోనీయులు యుద్ధానికి సమావేశమయ్యారు. గిలాదు ప్రాంతంలో వారు విడిది చేసారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కచోట సమావేశమయ్యారు. మిస్పా పట్టణం వద్ద ఉంది వారి విడిది. 18 గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజల నాయకులు, “అమ్మోను ప్రజలమీద దాడి చేసేందుకు మనల్ని ఎవరు నడిపిస్తారు? ఆ మనిషి, గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ ప్రధాని అవుతాడు” అన్నారు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International