Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 9 - పవిత్ర బైబిల్


ఒక క్రొత్త రోజు వస్తుంది

1 గతంలో జెబూలూను దేశం, నఫ్తాలి దేశం ముఖ్యంకాదు అనుకొన్నారు. కానీ ఉత్తరార్థంలో దేవుడు ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు. సముద్రం దగ్గర దేశం, యొర్దాను నది అవతల దేశం, యూదులు కానివారు నివసించే గలిలయ.

2 ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటిచోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” వారిమీద ప్రకాశిస్తుంది.

3 దేవా, నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు. ప్రజల్ని నీవు సంతోషపరుస్తావు. ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు తెలియజేస్తారు. అది కోతకాలపు సంతోషంలా ఉంటుంది. ప్రజలు యుద్ధంలో గెలిచిన సామగ్రిని పంచుకొన్నప్పుడు కలిగిన సంతోషంలా ఉంటుంది.

4 ఎందుకంటే, భారాన్ని నీవు తొలగించేస్తావు కనుక. ప్రజల వీపుల మీద నుండి భారమైన కాడిని నీవు తొలగించేస్తావు గనుక. నీ ప్రజలను శిక్షించేందుకు శత్రువు వినియోగించే కొరడాను నీవు తొలగించేస్తావు. అది నీవు మిద్యాను ఓడించిన సమయంలా ఉంటుంది.

5 యుద్ధంలో కదం తొక్కిన ప్రతి కాలిజోడు నాశనం చేయబడుతుంది. రక్తపు మరకలైన యుద్ధ వస్త్రం ప్రతీది నాశనం చేయబడుతుంది. అవన్నీ అగ్నిలో పడద్రోయబడతాయి.

6 మనకు ఒక బాలుడు పుట్టియున్నాడు. మనకు ఒక కుమారుడు ఇవ్వబడియున్నాడు. ఆయన భుజం మీద ప్రభుత్వమున్నది. “ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, శక్తిగల దేవుడు, నిత్యం జీవించే తండ్రి, సమాధాన రాజు” అనేది ఆయన పేరు.

7 ఆయన రాజ్యంలో శాంతి, శక్తి ఉంటాయి. దావీదు వంశపు ఈ రాజుకు అది కొనసాగుతుంది. ఈ రాజు మంచితనం, న్యాయపు తీర్పు ప్రయోగించి, రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ పాలిస్తాడు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు తన ప్రజల మీద బలీయమైన ప్రేమ ఉంది. ఈ బలీయమైన ప్రేమ ఆయనను ఈ పనులు చేసేటట్టుగా చేస్తుంది.


దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు

8 యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలకు విరోధంగా నా ప్రభువు ఒక ఆదేశం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఇవ్వబడిన ఆదేశానికి విధేయత చూపబడుతుంది.

9 అప్పుడు ఎఫ్రాయింము (ఇశ్రాయేలు)లో ప్రతి వ్యక్తి, చివరికి సమరయ నాయకులు కూడా దేవుడు తమని శిక్షించాడని తెలుసుకొంటారు. ఇప్పుడు ఆ ప్రజలు చాలా గర్వంగా, అతిశయంగా ఉన్నారు.

10 “ఈ ఇటుకలు పడిపోవచ్చు గాని మేము మళ్లీ నిర్మిస్తాం. ఇంకా గట్టి రాయితో మేము నిర్మిస్తాం. ఈ చిన్న చెట్లు నరికి వేయబడవచ్చును. కానీ మేము అక్కడ క్రొత్త చెట్లు వేస్తాము. ఆ క్రొత్త చెట్లు ఇంకా పెద్దగా, గట్టిగా ఉంటాయి.” అని ఆ ప్రజలు అంటారు.

11 అందుచేత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేందుకు యెహోవా మనుష్యుల్ని చూస్తాడు. వారి మీదికి రెజీను శత్రువులను యెహోవా తీసుకొని వస్తాడు.

12 తూర్పు నుండి సిరియన్లను, పడమటినుండి ఫిలిష్తీయులను యెహోవా తీసుకొని వస్తాడు. ఆ శత్రువులు తమ సైన్యాలతో ఇశ్రాయేలును ఓడిస్తారు. కానీ యెహోవా మాత్రం ఇంకా ఇశ్రాయేలు మీద కోపంగానే ఉంటాడు. యెహోవా ఆ ప్రజలను శిక్షించటానికి ఇంకా సిద్ధంగానే ఉంటాడు.

13 దేవుడు ప్రజలను శిక్షిస్తాడు గాని వాళ్లు మాత్రం పాపం చేయటం మానరు. వాళ్లు ఆయన దగ్గరకు మళ్లుకోరు. సర్వశక్తిమంతుడైన యెహోవాను వారు అనుసరించరు.

14 అందుచేత యెహోవా ఇశ్రాయేలీయుల తల, తోక కత్తిరించి వేస్తాడు. కాండాన్ని కొమ్మను కూడ ఒక్క రోజునే యెహోవా నరికి వేస్తాడు.

15 (తల అంటే పెద్దలు ప్రముఖ నాయకులు తోక అంటె అబద్ధాలు చెప్పే ప్రవక్తలు.)

16 ప్రజలను నడిపించే మనుష్యులు వారిని తప్పు త్రోవన నడిపిస్తున్నారు. కనుక వారిని అనుసరించే ప్రజలు నాశనం చేయబడతారు.

17 మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువకుల విషయం యెహోవాకు సంతోషం లేదు. వారి విధవలకు, అనాధలకు యెహోవా దయ చూపించడు. ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు అబద్ధాలు చెబుతారు. అందుచేత దేవుడు మనుష్యులమీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని శిక్షిస్తూనే ఉంటాడు.

18 చెడు అనేది చిన్న నిప్పులాంటిది. ఆ నిప్పుమొదట పొదలను, ముళ్లకంపల్ని తగలెడుతుంది: తర్వాత అరణ్యంలో ఉండే పెద్ద పొదలను ఆ నిప్పు తగలెడుతుంది. చివరికి అది పెద్ద అగ్నిగా మారుతుంది. అంతా పొగలో కలిసిపోతుంది.

19 సర్వశక్తిమంతుడైన యెహోవా కోపంగా ఉన్నాడు, కనుక దేశం కాల్చి వేయబడుతుంది. మనుష్యులంతా ఆ అగ్నిలో కాల్చి వేయబడతారు. ఎవ్వడూ తన సోదరుణ్ణి రక్షించే వ్రయత్నం చేయడు.

20 ప్రజలు కుడిపక్క ఏదో కొంత చేజిక్కించుకున్నా ఆకలిగానే ఉంటారు. ఎడమ పక్కన వాళ్లు ఏదో తింటారు, అయినా వాళ్లకు కడుపు నిండదు. అప్పుడు ప్రతివాడూ తిరిగి, తన స్వంత శరీరాన్నే తింటాడు.

21 (అంటే ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా మనష్షే యుద్ధం చేస్తాడు. మనష్షేకు వ్యతిరేకంగా ఎఫ్రాయిము యుద్ధం చేస్తాడు. తర్వాత వాళ్లిద్దరు యూదా మీద తిరగబడతారు అని అర్థం.) యెహోవా ఇశ్రాయేలు మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. యెహోవా ఇంకా తన ప్రజల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan