యెషయా 62 - పవిత్ర బైబిల్క్రొత్త యెరూషలేము మంచితనంతో నిండిన నగరం 1 సీయోను అంటే నాకు ప్రేమ. అందుచేత నేను ఆమె పక్షంగా ఇంకా మాట్లాడతాను. యెరూషలేము అంటే నాకు ప్రేమ. అందుచేత నేను మాట్లాడటం చాలించను. మంచితనం పెద్ద వెలుగుగా ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను. ఒక జ్వాలలా రక్షణ నుండి ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను. 2 అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని చూస్తాయి. రాజులందరూ నీ గౌరవాన్ని చూస్తారు. అప్పుడు నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుంది. ప్రజలారా, యెహోవా తానే మీకు ఆ క్రొత్త పేరు ఇస్తాడు. 3 యెహోవా మీ విషయం ఎంతో అతిశయిస్తాడు. యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు మీరు. 4 “దేవుడు విడిచిపెట్టిన ప్రజలు” అని ఇంకెన్నడూ మీరు పిలువబడరు. “దేవుడు నాశనం చేసిన దేశం” అని మీ దేశం ఇంకెన్నటికి పిలువబడదు. “దేవుడు ప్రేమించే ప్రజలు” అని మీరు పిలువబతుతారు. “దేవుని వధువు” అని మీ దేశం పిలువబడుతుంది. ఎందుకంటె యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక. మరియు మీ దేశం ఆయనకు చెందుతుంది. 5 ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు ఆమె అతనికి భార్య అవుతుంది. అదేవిధంగా మీ దేశం మీ పిల్లలకు చెందుతుంది. ఒకడు తన నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు. అదే విధంగా, మీ దేవుడు మీతో ఎంతో సంతోషిస్తాడు. 6 కావలి ఉండుటకు యెరూషలేము గోడల మీద కావలివారిని (ప్రవక్తలను) నేను ఉంచుతాను. ఈ కావలివారు మౌనంగా ఉండరు. రాత్రింబవళ్లు వారు కనిపెట్టి ఉంటారు. యెహోవాను గూర్చి ఉపదేశించే మీరు ఎన్నటికీ మౌనంగా ఉండకూడదు. యెహోవాను ప్రార్థించటం మీరు చాలించకూడదు. 7 మీరు ఎల్లప్పుడూ యెహోవాను ప్రార్థించాలి. ఆయన యెరూషలేమును మరల ఒక పట్టణంగా చేసేంతవరకు యెహోవాకు ప్రార్థించండి. భూమిమీద ప్రజలంతా పొగడే పట్టణంగా ఆయన యెరూషలేమును చేసేంత వరకు యెహోవాకు ప్రార్థించండి. 8 యెహోవా ఒక వాగ్దానం చేశాడు. యెహోవా తన స్వంత శక్తిని రుజువుగా వినియోగించి ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు యెహోవా తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా చెప్పాడు, “మీ ఆహారాన్ని మరెన్నడూ మీ శత్రువులకు ఇవ్వనని నేను వాగ్దానం చెస్తున్నాను. మీరు తయారు చేసే మీ ద్రాక్షరసాన్ని మీ శత్రువులు ఎన్నటికీ తీసుకోరని నేను వాగ్దానం చేస్తున్నాను. 9 ఆహారం కూర్చుకొనేవాడు దానిని తింటాడు. మరియు ఆ వ్యక్తి యెహోవాను స్తుతిస్తాడు. ద్రాక్షపండ్లను కూర్చుకొనేవాడు ఆ ద్రాక్షపండ్ల రసం త్రాగుతాడు. ఈ సంగతులన్నీ నా పవిత్రదేశంలో జరుగుతాయి.” 10 గుమ్మాలద్వారా రండి, ప్రజలకు దారి సరళం చేయండి. మార్గం సిద్ధం చేయండి! మార్గంలోని రాళ్లన్నీ తీసివేయండి. ప్రజలకు గుర్తుగా పతాకం ఎగురవేయండి! 11 వినండి, దూర దేశాల ప్రజలందరితో యెహోవా మాట్లాడుతున్నాడు: “సీయోను ప్రజలకు చెప్పండి. చూడండి, మీ రక్షకుడు వస్తున్నాడు. ఆయన మీ బహుమానం మీ కోసం తెస్తున్నాడు. ఆయన ఆ బహుమానాన్ని తనతో కూడ తెస్తున్నాడు.” 12 ఆయన ప్రజలు, “పరిశుద్ధ ప్రజలు” “విమోచించబడిన యెహోవా ప్రజలు” అని పిలువబడతారు. “దేవుడు కోరే పట్టణం” “దేవుడు తోడుగా ఉన్న పట్టణం” అని యెరూషలేము పిలువబడుతుంది. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International