Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 59 - పవిత్ర బైబిల్


చెడ్డవాళ్లు వారి జీవితాలు మార్చుకోవాలి

1 చూడు, నిన్ను రక్షించుటకు యెహోవా శక్తి చాలు. సహాయంకోసం నీవు ఆయనను అడిగినప్పుడు ఆయన వినగలడు.

2 కానీ నీ పాపాలు నిన్ను నీ దేవుని నుండి వేరుచేశాయి. యెహోవా నీ పాపాలు చూసి, నీ నుండి తిరిగిపోతాడు.

3 నీ చేతులు మైలగా ఉన్నాయి, అవి రక్తంతోనిండి ఉన్నాయి. నీ వేళ్లు దోషంతో నిండి ఉన్నాయి. నీవు నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు. నీ నాలుక చెడు విషయాలు పలుకుతుంది.

4 ఎవ్వరూ ఇతరులను గూర్చి సత్యం చెప్పరు. ప్రజలు ఒకరి మీద ఒకరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు, వారి వ్యవహారం గెలుచుకొనేందుకు వారు తప్పుడు వాదాలమీద ఆధారపడతారు. వారు ఒకరిని గూర్చి ఒకరు అబద్ధాలు చెబుతారు. వారు చిక్కులతో నిండిపొయి, కీడును పుట్టిస్తారు.

5 విషసర్పాల గ్రుడ్లవలె, వారు కీడును పొదుగుతారు. ఆ గ్రుడ్లు ఒకటి తింటే నీవు చస్తావు. ఆ గ్రుడ్లలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విషసర్పం బయటకు వస్తుంది. ప్రజలు అబద్ధాలు చెబుతారు. ఈ అబద్ధాలు సాలెగూళ్లలా ఉంటాయి.

6 వారు అల్లే ఈ గూళ్లు బట్టలకు ఉపయోగపడవు. ఆ గూళ్లతో నిన్ను నీవు కప్పుకోలేవు. కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరులను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు.

7 కీడుకు పరుగులెత్తుటకు ఆ ప్రజలు వారి పాదాలను ఉపయోగిస్తారు. ఏ తప్పూ చేయని వారిని చంపటానికి వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. దౌర్జన్యం, దొంగతనం వారి జీవిత విధానం.

8 ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.


ఇశ్రాయేలీయుల పాపం కష్టాన్ని తెస్తుంది

9 న్యాయం, మంచితనం అంతా పోయింది. చీకటి మాత్రమే మనవద్ద ఉంది. అందుచేత మనం వెలుగుకోసం కనిపెట్టాలి. ప్రకాశవంతమైన వెలుగుకోసం మనం నిరీక్షిస్తాం. కానీ మనకు ఉన్నదంతా చీకటి మాత్రమే.

10 మనం కళ్లులేని ప్రజల్లా ఉన్నాం. మనం గుడ్డివాళ్లలా గోడల మీదికి నడుస్తాం. అది రాత్రియైనట్టు మనం జారి పడ్తాం. పగటి వెలుగులో కూడా మనం చూడలేం. మధ్యాహ్న సమయంలో మనం చచ్చినవాళ్లలా పడిపోతాం.

11 మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం. పావురాల్లా, ఎలుగుబంట్లలా విచారకరమైన శబ్దాలు మనం చేస్తాం. మనుష్యులు న్యాయంగా ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం. కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు. మనం రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం, కానీ రక్షణ ఇంకా దూరంగానే ఉంది.

12 ఎందుకంటే మనం మన దేవునికి వ్యతిరేకంగా ఎన్నెన్నో తప్పు పనులు చేశాం గనుక. మనదే తప్పు అని మన పాలు చూపెడ్తున్నాయి. ఈ పనులు చేసి మనం దోషులంగా ఉన్నామని మనకు తెలుసు.

13 మనం పాపంచేసి, యెహోవాకు విరోధంగా తిరిగాం. మనం యెహోవా నుండి తిరిగిపోయి, ఆయన్ని విడిచిపెట్టేశాం. చెడు విషయాలను మనం ఆలోచించాం. దేవునికి వ్యతిరేకమైన వాటినే మనం ఆలోచించాం. వీటిని గూర్చి మనం ఆలోచించి, మన హృదయాల్లో వాటి పథకాలు వేసుకొన్నాం.

14 మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది. న్యాయం దూరంగా నిలుస్తుంది. సత్యం వీధుల్లో పడిపోయింది. మంచితనం పట్టణంలో ప్రవేశించటానికి అనుమతించబడటం లేదు.

15 సత్యం పోయింది. మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు. యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది యెహోవాకు ఇష్టం కాలేదు.

16 యెహోవా చూశాడు. నిలిచి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడూ ఆయనకు కనిపించలేదు. కనుక యెహోవా తన స్వంత శక్తి, తన స్వంత మంచితనం ప్రయోగించాడు. మరియు యెహోవా ప్రజలను రక్షించాడు.

17 యెహోవా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పుకొన్నాడు. రక్షణ శిరస్త్రాణం ధరించాడు. శిక్షను వస్త్రాలుగా ధరించాడు. బలీయమైన ప్రేమ అంగీ ధరించాడు.

18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు. యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు. కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.

19 అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు. వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు. యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.

20 అప్పుడు సీయోనుకు ఒక రక్షకుడు వస్తాడు. పాపం చేసినప్పటికి, తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన యాకోబు ప్రజల దగ్గరకు ఆయన వస్తాడు.

21 “ఆ ప్రజలతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటాను. నీ నోట నేను ఉంచే నా ఆత్మ, నా మాటలు నిన్ను ఎన్నడూ విడిచిపోవు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ పిల్లలతోను, నీ పిల్లల పిల్లలతోను అవి ఉంటాయి. అవి ఇప్పుడు, ఎల్లప్పుడు నీతో ఉంటాయి” అని యెహోవా చెబుతున్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan