Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 50 - పవిత్ర బైబిల్


పాపం చేసినందువల్ల ఇశ్రాయేలు శిక్షించబడింది

1 యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీ తల్లి యెరూషలేముకు నేను విడాకులిచ్చానని మీరంటున్నారు. అయితే ఆమెను నేను విడనానట్లు నిదర్శన కాయితాలు ఏయి? నా పిల్లలారా, ఎవరికైనా నేను డబ్బు రుణం ఉన్నానా? అప్పు తీర్చటానికి నేను మిమ్నల్ని అమ్ముకొన్నానా? లేదు. చూడండి, మీరు చేసిన చెడ్డ పనుల మూలంగానే నేను మిమ్మల్ని విడిచి పెట్టేసాను. మీ తల్లి (యెరూషలేము) చేసిన చెడ్డ పనుల వల్లనే ఆమెను నేను పంపివేశాను.

2 నేను ఇంటికి వచ్చాను, ఎవరూ కనబడలేదు. నేను పిలిచి, పిలిచి, ఎంత పిలిచినా ఎవరూ పలుక లేదు. నేను మిమ్మల్ని రక్షించలేనని మీరు తలుస్తున్నారా? మీ కష్టాలనుండి మిమ్మును రక్షించే శక్తినాకు ఉంది. చూడండి, సముద్రాన్ని ఎండి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది! అక్కడ నీళ్లు ఉండవు గనుక చేపలు చస్తాయి, అవి కుళ్లిపోతాయి.

3 ఆకాశాన్ని నేను చీకటి కమ్మివేసేలా చేయగలను. విచార వస్త్రాల్లా ఆకాశం నల్లగా అవుతుంది.”


దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడతాడు

4 ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన యెహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచారగ్రస్థ ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా నాకు ఉపదేశిస్తాడు.

5 నేను నేర్చుకొనేందుకు నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను వెంబడించటం మానను.

6 నేను ఆ ప్రజల్ని నన్ను కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు నేను నా ముఖం దాచుకోను.

7 నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను బలవంతుడనై ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు తెలుసు.

8 యెహోవా నాతో ఉన్నాడు. నేను నిర్దోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవరైనా రుజువు చేయాలనుకొంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలి. మేము ఒక తీర్పు జరిగిస్తాం.

9 అయితే చూడండి, నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. వాటిని చెదలు తినేస్తాయి.

10 యెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవకుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగుతుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తాడు. అతడు వాస్తవంగా యెహోవా నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు తన దేవుని మీద ఆధారపడతాడు.

11 “ప్రజలారా, చూడండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకొంటున్నారు. మీ మంటలను, జ్వాలలను మీరే అంటిస్తున్నారు. అలానే, మీ దారిన మీరు జీవిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మీరు మీ మంటల్లో, జ్వాలల్లో పడతారు, మీరు కాల్చివేయబడుతారు. అలా జరిగేట్టు నేను చేస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan