Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 35 - పవిత్ర బైబిల్


దేవుడు తన ప్రజలను ఓదారుస్తాడు

1 ఎండిన అరణ్యం సంతోషిస్తుంది. అరణ్యం ఉల్లసించి, కస్తూరి పుష్పంలా పూస్తుంది.

2 అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.

3 బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బలహీనమైన మోకాళ్లను బలపర్చండి.

4 ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు.

5 అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చెవులు తెరువబడుతాయి.

6 కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు పారటం మొదలైనప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి.

7 ఇప్పుడు నీళ్లలా కనిపించే ఎండమావుల్ని ప్రజలు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. భూమిలో నుండి నీళ్లు ఉబుకుతాయి. ఒకప్పుడు అడవిమృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు పెరుగుతాయి.

8 ఆ సమయంలో అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. ఈ రాజమార్గం “పవిత్ర రాజమార్గం” అని పిలువబడుతుంది. ఆ రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవనీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ ఆ మార్గానికి వెళ్లరు. మంచివాళ్లు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారు.

9 ఆ మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హానిచేసేందుకు ఆ మార్గంలో సింహాలు ఉండవు. ప్రమాదకరమైన జంతువులు ఏమీ ఆ మార్గంలో ఉండవు. ఆ మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమే ఉంటుంది.

10 దేవుడు తన ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. ఆ ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వస్తారు. ప్రజలు సీయోను లోనికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ఆ ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. వారి సంతోషం వారి తలల మీద ఒక కిరీటంలా ఉంటుంది. వారి సంతోషం, ఆనందం వారిని సంపూర్ణంగా నింపేస్తాయి. విచారం, దుఃఖం దూరదూరాలకు పారిపోతాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan