యెషయా 27 - పవిత్ర బైబిల్1 ఆ సమయంలో వంకర సర్పమైన మకరానికి ఆయన తీర్పు తీర్చును. యెహోవా తన ఖడ్గం ప్రయోగిస్తాడు, కఠినమైన, తన శక్తిగల ఖడ్గంతో ఆయన మకర సర్పాన్ని ఆ మెలికల సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ పెద్ద ప్రాణిని సముద్రం లోనే యెహోవా చంపేస్తాడు. 2 ఆ సమయంలో సంతోషకరమైన ద్రాక్షతోటను గూర్చి ప్రజలు పాటలు పాడుతారు. 3 “యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధతీసుకుంటాను. సరైన సమయంలో తోటకు నీళ్లు పెడతాను. రాత్రింబవళ్లు ఆ తోటను నేను కాపాడుతాను. ఆ తోటకు ఎవ్వరూ హాని చేయరు. 4 నేను కోపంగా లేను. కానీ యుద్ధంలో ఎవరైనా సరే ముళ్ల పొదల కంచె వేస్తే అప్పుడు నేను దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను. 5 అయితే ఎవరైనా భద్రత కోసం నా దగ్గరకు వస్తే నాతో సమాధాన పడాలని కోరితే, అలాంటివాడు వచ్చి నాతో సమాధానపడాలి. 6 ప్రజలు నా దగ్గరకు వస్తారు. మంచి వేరులు గల మొక్కలా యాకోబు బలంగా ఉండేందుకు ఆ ప్రజలు సహాయం చేస్తారు. వికసించ మొదలు బెట్టిన మొక్కలా ఇశ్రాయేలు ఎదుగునట్లు ఆ ప్రజలు చేస్తారు. అప్పుడు చెట్ల ఫలాల్లా, ఇశ్రాయేలు పిల్లలతో దేశం నిండిపోతుంది.” దేవుడు ఇశ్రాయేలును దూరంగా పంపించివేస్తాడు 7 యెహోవా తన ప్రజలను ఎలా శిక్షిస్తాడు? గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెహోవా కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, అనేక మందిని చంపేస్తాడా? 8 యెహోవా తన ప్రజల భయాన్ని వెళ్లగొట్టేసి, వారిలో తనకుగల వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇశ్రాయేలీయులతో యెహోవా కఠినంగా మాట్లాడుతాడు. ఆయన మాటలు ఎడారి వేడి గాడ్పులా మండుతాయి. 9 యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? అతని పాపాలు తీసివేయబడేట్లుగా ఏం సంభవిస్తుంది? ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు ధూళిగా చితుకగొట్టబడతాయి. తప్పు దేవుళ్లను పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు నాశనం చేయబడతాయి. 10 ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి మేస్తాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి. 11 ద్రాక్షవల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు. ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు. 12 ఆ సమయంలో యెహోవా తన ప్రజలను ఇతరులనుండి ప్రత్యేకించటం ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది దగ్గర ఆయన ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది మొదలు ఈజిప్టు నదివరకు గల తన ప్రజలందరినీ యెహోవా సమావేశ పరుస్తాడు. మీరు ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరుగా, ఒకే చోట చేర్చబడుతారు. 13 నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగపడతారు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International