Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 22 - పవిత్ర బైబిల్


యెరూషలేముకు దేవుని సందేశం

1 దర్శన లోయను గూర్చిన విచారకరమైన సందేశం: ప్రజలారా మీకు ఏమయింది? మీరు ఎందుకు మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు?

2 గత కాలంలో ఈ పట్టణం చాలా కలవరంతో నిండి ఉండేది. ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్లాసంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నీ ప్రజలు చంపి వేయబడ్డారు. కానీ కత్తులతో కాదు. ప్రజలు మరణించారు కానీ యుద్ధం చేస్తూ కాదు.

3 మీ నాయకులంతా ఒక్కుమ్మడిగా పారి పోయారు కానీ వాళ్లంతా బాణాలు లేకుండానే బంధించబడ్డారు. నాయకులంతా కలిసి దూరంగా పారిపోయారు. కానీ వాళ్లు బంధించబడ్డారు.

4 అందుకే నేనంటాను, “నా వైపు చూడవద్దు! నన్ను ఏడ్వనివ్వండి. యెరూషలేము నాశనం గూర్చి నన్ను ఆదరించాలని పరుగెత్తి రాకండి.”

5 యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు తొక్కుకుంటారు. పట్టణ ప్రాకారాలు కూలగొట్ట బడతాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు.

6 ఏలాము గుర్రాల సైనికులు వారి బాణాల పొదిని తీసుకొని యుద్ధానికీ స్వారీ చేస్తారు. కీరుప్రజలు వారి డాళ్లతో శబ్దాలు చేస్తారు.

7 సైన్యాలు మీ ప్రత్యేక లోయలో కలుసుకొంటాయి. లోయంతా రథాలతో నిండిపోతుంది. గుర్రాల సైనికులు పట్టణ ద్వారాల ముందు ఉంటారు.

8 యూదా వారు అరణ్య భవనంలో దాచుకొన్న వారి ఆయుధాలను ఆ సమయంలో ప్రయోగించాలని కోరుకొంటారు. యూదాను కాపాడుతున్న గోడలను శత్రువు కూలగొట్టేస్తాడు.

9-11 దావీదు పట్టణపు గోడలు బీటలు వారటం మొదలవుతుంది, ఆ బీటలు మీరు చూస్తారు. కనుక మీరు ఇళ్లను లెక్కబెట్టి, ఆ ఇండ్ల రాళ్లను గోడలు బాగుచేయటానికి ఉపయోగిస్తారు. పాత కాలువ నీళ్లు నిల్వచేయటానికి రెండు గోడల మధ్య మీరు ఖాళీ ఉంచుతారు, మీరు నీటిని నిల్వచేస్తారు. ఇదంతా మిమ్మల్ని మీరు కాపాడుకొనేందుకు చేస్తారు. కానీ వీటన్నింటినీ చేసిన దేవుణ్ణి మీరు నమ్ముకోరు. వీటన్నింటినీ చాలకాలం క్రిందట చేసిన వానిని (దేవుణ్ణి) మీరు చూడరు.

12 కనుక నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలను ఏడ్చి, చనిపోయిన వారి స్నేహితుల కోసం దుఃఖంగా ఉండమని చెబుతాడు. ప్రజలు గుండ్లు గీసికొని, విచార సూచక వస్త్రాలు ధరిస్తారు.

13 అయితే చూడండి, ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇలా అంటున్నారు: మనం వేడుక చేసుకొందాం పశువుల్ని, గొర్రెల్ని వధించండి. మీరు భోజనం తిని, ద్రాక్షరసం త్రాగండి తినండి, త్రాగండి, ఎందుకంటె రేపు మనం చస్తాం.

14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: “మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం క్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.


షెబ్నాకు దేవుని సందేశం

15 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు: “ఆ సేవక షెబ్నా దగ్గరకు వెళ్లు. ఆ సేవకుడు భవనం అధికారి.

16 నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?” అని ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.

17-18 “ఓ మనిషీ, యెహోవా నిన్ను చితక గొట్టేస్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుట్టేసి, చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరోదేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.” యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో నీ రథాలు ఎన్నదగినవిగా కనబడవు.

19 ఇక్కడి నీ ప్రముఖ పదవినుండి నిన్ను నేను వెళ్లగొడతాను. నీ ప్రముఖ పదవినుండి, నీ క్రొత్త పాలకుడు నిన్ను తీసుకొని వెళ్లిపోతాడు.

20 ఆ సమయంలో హిల్కీయా కుమారుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను.

21 నేను నీ అంగీ తీసి ఆ సేవకుని మీద వేస్తాను. నీ నడికట్టు అతనికి ఇస్తాను. నీ ముఖ్య పదవి అతనికి ఇస్తాను. యెరూషలేము ప్రజలకు, యూదా వంశానికి ఈ సేవకుడు ఒక తండ్రిలా ఉంటాడు.

22 “దావీదు ఇంటి తాళపు చెవిని అతని మెడలో నేను కడతాను. అతడు ఒక ద్వారం తెరిస్తే, అది తెరచుకొనే ఉంటుంది. ఏ మనిషీ దాన్ని మూసి వేయలేడు. అతడు ఒక ద్వారం మూసివేస్తే, ఆ ద్వారం మూసికొనే ఉంటుంది. ఏ మనిషీ దానిని తెరవలేడు. ఆ సేవకుడు తన తండ్రి ఇంటిలో ఘనమైన పీఠంలా ఉంటాడు.

23 గట్టిచెక్కకు కొట్టబడిన మేకులా అతణ్ణి నేను బలంగా చేస్తాను.

24 అతని తండ్రి ఇంటిలో ఘనమైన వాటిని, గొప్పవాటిని నేను అతని మీద వేలాడదీస్తాను. పెద్దలు, పిల్లలు అందరూ అతని మీద ఆధారపడతారు. ఆ మనుష్యులు ఆయన మీద వేలాడుతోన్న చిన్న పాత్రల్లా, పెద్ద నీళ్ల చెంబుల్లా ఉంటారు.

25 “ఆ సమయంలో, ప్రస్తుతం గట్టి చెక్కకు కొట్టబడిన మేకు (షెబ్నా) బలహీనమవుతుంది, విరిగిపోతుంది. ఆ మేకు నేలమీద పడిపోతుంది, ఆ మేకుకు వేలాడుతున్న వస్తువులన్నీ నాశనం అవుతాయి. అప్పుడు, ఈ సందేశంలో నేను చెప్పిన సంగతులు అన్నీ సంభవిస్తాయి.” (యెహోవా చెప్పాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి.)

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan