Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెషయా 21 - పవిత్ర బైబిల్


బబులోనుకు దేవుని సందేశం

1 సముద్రతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి విచారకరమైన సందేశం: అరణ్యం నుండి ఏదో వస్తోంది? నెగెవ్‌నుండి వీచే గాలిలా అది వస్తోంది. అది ఒక భయంకర దేశం నుండి వస్తోంది.

2 జరుగబోయే దారుణమైన ఒక సంగతి నేను చూసాను. దేశద్రోహులు నీకు విరోధంగా లేవటం నేను చూశాను. ప్రజలు నీ ఐశ్వర్యం తీసుకోవటం నేను చూశాను. ఏలాము, వెళ్లి ఆ ప్రజలతో యుద్ధం చేయి. మాద్యా, పట్టణం చుట్టూరా నీ సైన్యాలను ఉంచి, దాన్ని జయించు. ఆ పట్టణంలో చెడు సంగతులన్నింటినీ నేను అంతం చేస్తాను.

3 ఆ భయంకర విషయాలు నేను చూశాను, ఇప్పుడు నేను భయపడ్తున్నాను. నా భయంవల్ల నా కడుపులో దేవేస్తోంది. ఆ బాధ ప్రసవవేదనలా ఉంది. నేను వినే విషయాలు నన్ను చాలా భయపెట్టేస్తాయి. నేను చూచే విషయాలు నన్ను భయంతో వణకిస్తాయి.

4 నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకిపోతున్నాను. సంతోషకరమైన నా సాయంపూట, భయం పుట్టే రాత్రిగా తయారయింది.

5 అంతా బాగానే వుందని ప్రజలు తలస్తున్నారు. ప్రజలు అంటారు: “బల్ల సిద్ధం చేయండి! బల్లమీద బట్ట పరచండి! తినండి! తాగండి!” కానీ ప్రజలు, “నాయకులారా, లేవండి, యుద్ధానికి సిద్ధపడండి” అని చెప్పాలి.

6 ఎందుకంటే నా ప్రభువు, నాతో ఈ విషయాలు చెప్పాడు: “వెళ్లి, పట్టణాన్ని కాపాడేందుకు ఒక మనిషికోసం చూడు.

7 కావలివాడు గుర్రాల మీద సైనికుల్ని, గాడిదలు, లేక ఒంటెలను చూస్తే కావలివాడు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినాలి.”

8 అప్పుడు ఆ కావలివాడు సింహం అనే హెచ్చరిక మాట గట్టిగా చెప్పాలి. కావలివాడు యెహోవాతో చెప్పాడు: “నా ప్రభూ! ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద ఉన్నాను. ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే ఉన్నాను, కానీ

9 అదిగో, వాళ్లు వచ్చేస్తున్నారు, బారులుతీరిన మనుష్యులు, గుర్రాల మీద సైనికులు నాకు కనబడుతున్నారు.” అప్పుడు పురుషుల్లో ఒకడు అన్నాడు: “బబులోను ఓడించబడింది. బబులోను నేల మట్టంగా కూలిపోయింది. దాని అబద్ధ దేవుళ్ల విగ్రహాలన్నీ నేలకు కొట్టబడ్డాయి, ముక్కలు ముక్కలుగా విరిగి పోయాయి.”

10 యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.”


ఎదోముకు దేవుని సందేశం

11 దూమాను గూర్చిన విచారకరమైన సందేశం: శేయీరునుండి ఎవరో నన్ను పిలిచి అడుగుతున్నారు, “కావలివాడా, రాత్రి ఎంత వేళయింది? కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?”

12 కావలివాడు జవాబిచ్చాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. నీవు అడగాల్సింది ఏమైనా ఉంటే తిరిగి వచ్చి అడుగుము.”


అరేబియాకు దేవుని సందేశం

13 అరేబియాను గూర్చి విచారకరమైన సందేశం: దెదానునుండి వచ్చిన ఒంటెల ప్రయాణీకులు అరబి ఎడారిలో కొన్ని చెట్ల దగ్గర రాత్రి గడిపారు.

14 దాహంతో ఉన్న కొందరు ప్రయాణీకులకు వారు నీళ్లు ఇచ్చారు. ప్రయాణం చేస్తున్న కొందరు ప్రజలకు తేమా ప్రజలు భోజనం పెట్టారు

15 చంపడానికి సిద్ధంగా ఉన్న కత్తులనుండి ఆ ప్రజలు పారిపోతూ ఉన్నారు. గురిపెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న బాణాలనుండి వారు పారిపోతున్నారు. కష్టతరమైన యుద్ధంనుండి వారు పారిపోతున్నారు.

16 ఆ సంగతులు జరుగుతాయని నా ప్రభువైన యెహోవా నాతో చెప్పాడు: “ఒక్క సంవత్సరంలో (కూలివాని కాలమానం ప్రకారం) కేదారు ఘనత అంతా పోతుంది.

17 ఆ సమయంలో కేదారు మహా వీరుల్లో కొద్దిమంది విలుకాండ్రు మాత్రమే బ్రతికి ఉంటారు.” ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఈ సంగతులు నాకు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan