యెషయా 16 - పవిత్ర బైబిల్1 ఆ దేశపు రాజుకు మీరు ఒక కానుక పంపాలి. సెలానుండి అరణ్యంగుండా సీయోను కుమార్తె కొండకు (యెరూషలేము) మీరు ఒక గొర్రెపిల్లను పంపాలి. 2 మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు ప్రయత్నిస్తారు. సహాయం కోసం వారు ఒకచోట నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు. వారు, గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న పిట్ట పిల్లలా ఉంటారు. 3 “మాకు సహాయం చేయండి, మేం ఏం చేయాలో మాకు చెప్పండి! మధ్యాహ్నపు ఎండనుండి నీడ కాపాడినట్టు మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి. మా శత్రువుల నుండి మేం పారిపోతున్నాం మమ్మల్ని దాచిపెట్టండి. మమ్మల్ని మా శత్రువులకు అప్పగించకండి అని వారంటారు. 4 ఆ మోయాబు ప్రజలు వారి ఇండ్లనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు. కనుక వాళ్లను మీ దేశంలో నివాసం ఉండనియ్యండి. వారి శత్రువులనుండి వారిని కాపాడండి.” దోచుకోవటం ఆగిపోతుంది. శత్రువు ఓడించబడతాడు. ఇతరులను బాధించే పురుషులు దేశం నుండి వెళ్లిపోతారు. 5 అప్పుడు క్రొత్త రాజు వస్తాడు. ఈ రాజు దావీదు వంశంవాడు. ఆయన నిజాయితీ పరుడు. ఆయన ప్రేమ, దయగలవాడు. ఈ రాజు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. సరియైనవి, మంచివి ఆయన చేస్తాడు. 6 మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని, మోసగాళ్లని మేము విన్నాం. ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు. అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే. 7 ఆ గర్వం చేత మొత్తం మోయాబు దేశం శ్రమ అనుభవిస్తుంది. మోయాబు ప్రజలంతా ఏడుస్తారు. ప్రజలు విచారిస్తారు. గతంలో వారికి ఉన్నవన్నీ మళ్లీ కావాలనుకొంటారు. కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు కావాలని వారు కోరుకొంటారు. 8 హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్ష వల్లులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని ప్రజలు విచారంగా ఉంటారు. విదేశీ పాలకులు ద్రాక్ష వల్లులను నరికివేశారు. శత్రుసైన్యాలు యాజరు పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్తరించారు. సముద్రం వరకు వారు విస్తరించారు. 9 “ద్రాక్ష పండ్లు నాశనం చేయబడ్డాయి. కనుక యాజరు, సిబ్మా ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. పంట ఉండదు గనుక హెష్బోను, ఏలాలే ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. వేసవి పండ్లు ఏమీ ఉండవు. సంతోషపు కేకలు అక్కడ ఉండవు. 10 కర్మెలులో పాటలు పాడటం మరియు సంతోషం ఉండదు. పంట కోత సమయంలో సంతోషం అంతా నేను నిలిపివేస్తాను. ద్రాక్షపండ్లు ద్రాక్షరసం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ అవన్నీ వ్యర్థం అవుతాయి. 11 అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా విచారం కీర్హరెశు గూర్చి నాకు చాలా విచారం ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం. 12 మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు. ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు. కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.” 13 మోయాబును గూర్చి ఈ విషయాలు యెహోవా ఎన్నోసార్లు చెప్పాడు. 14 ఇప్పుడు “మూడు సంవత్సరాల్లో (కూలీ వాని కాలం లెక్క ప్రకారం) ఆ ప్రజలందరూ ఉండరు, వారికి అతిశయాస్పదమైనవన్నీ పోతాయి. కొంతమంది మనుష్యులు మిగిలి ఉంటారు. కానీ వారు ఎక్కువ మంది ఉండరు” అని యెహోవా చెబుతున్నాడు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International