Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హోషేయ 11 - పవిత్ర బైబిల్


ఇశ్రాయేలు యెహోవాను మరచి పోవుట

1 “ఇశ్రాయేలు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను. మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.

2 కాని, ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు. బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు. విగ్రహాలకు వారు ధూపం వేశారు.

3 “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే! ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తుకొన్నాను! నేను వారిని స్వస్థపరిచాను. కాని అది వారికి తెలియదు.

4 తాళ్లతో నేను వారిని నడిపించాను. కాని అవి ప్రేమ బంధాలు. నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను. నేను వంగి వారికి భోజనం పెట్టాను.

5 “ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు.

6 వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.

7 “నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”


యెహోవా ఇశ్రాయేలుని నాశనం చేయడు

8 “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకు లేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను సెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చుకుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.

9 నేను నా కోపాగ్నిని అణచుకొంటాను. నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి. నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.

10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే, నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు. భయంతో కంపిస్తూ నా బిడ్డలు పశ్చిమ దిశనుంచి వస్తారు.

11 వాళ్లు ఈజిప్టు నుంచి పక్షుల్లా వణుకుతూ వస్తారు. వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు. నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు.

12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టుముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! కాని, యూదా యింకా ఎల్‌-తోనే నడుస్తున్నాడు. యూదా అపవిత్రులకు నమ్మకస్తుడుగా ఉన్నాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan